Manipur: మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు.. రెండు రోజుల్లో 700 మంది

సుమారు 700 మందికి పైగా మయన్మార్‌ (Myanmar) వాసులు మణిపుర్‌ (Manipur)లోకి ప్రవేశించినట్లు సమాచారం. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Updated : 25 Jul 2023 16:53 IST

ఇంఫాల్‌: తెగల మధ్య వైరం కారణంగా మణిపుర్‌ (Manipur)లో రెండు నెలలకుపైగా ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ క్రమంలోనే మరో కొత్త అంశం మణిపుర్‌ (Manipur) ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. సుమారు 700 మందికి పైగా మయన్మార్‌ (Myanmar) వాసులు మణిపుర్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అస్సాం రైఫిల్స్ సెక్టార్‌ 28 అందించిన సమాచారం ప్రకారం 718 మంది మయన్మార్‌ వాసులు జులై 23-24 తేదీల్లో మణిపుర్‌లోని చందేల్‌ జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నారు. వీరంతా సరైన ప్రయాణ పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించారని వెల్లడించింది. 

గుండె బరువై..ఆశ్రయం కరవై..

‘‘ సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన వారిని వెనక్కి పంపేయాలని అస్సాం రైఫిల్స్‌కు సూచించాం. వీసా, అధీకృత ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి ఎవరిని మణిపుర్‌లో అనుమతించవద్దని కేంద్ర హోం శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయన్మార్‌ వాసులను మణిపుర్‌లోకి అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్‌కు తెలియజేశాం’’ అని మణిపుర్‌ చీఫ్‌ సెక్రటరీ డా. వినీత్‌ జోషి తెలిపారు.

మణిపుర్‌లో ఆందోళనకారులకు మయన్మార్‌ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గత నెలలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గత నెలలో మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ క్రమంలో మయన్మార్‌ వాసులు మణిపుర్‌లోకి ప్రవేశించడంపై మణిపుర్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని