Uddhav Thackeray: ‘ఇలాగైతే పీఎం, సీఎంల ఎంపికకు టెండర్లు పిలుస్తారు’.. కేంద్రంపై ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు

సైన్యంలో కొత్తగా ప్రతిపాదించిన ‘అగ్నిపథ్‌(Agnipath)’ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) తాజాగా కేంద్రంపై మండిపడ్డారు. ‘ఒప్పంద పద్ధతిలో సైనిక నియామకాలు ప్రమాదకరం. యువత ఆశయాలు...

Published : 20 Jun 2022 02:04 IST

ముంబయి: సైన్యంలో కొత్తగా ప్రతిపాదించిన ‘అగ్నిపథ్‌(Agnipath)’ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) తాజాగా కేంద్రంపై మండిపడ్డారు. ఒప్పంద పద్ధతిలో సైనిక నియామకాలు ప్రమాదకరం.. యువత ఆశయాలు, జీవితాలతో ఆడుకోవడం సరికాదని పేర్కొన్నారు. శివసేన(ShivSena) 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అగ్నిపథ్‌లో నియామకాల తీరును ఎండగడుతూ.. ‘రేపు అద్దెకు ప్రభుత్వం కావాలంటారు. ప్రధాని, ముఖ్యమంత్రుల ఎంపిక కోసం టెండర్లు పిలుస్తారు. ఒకవేళ ఇలాగే కొనసాగించాలనుకుంటే.. ప్రతిదానికీ అద్దెకు తీసుకుని తొలగించే(హైర్‌ అండ్‌ ఫైర్‌), వాడి పడేసే(యూజ్ అండ్ త్రో) నియామక విధానాలను అవలంబించాలి’ అని కేంద్రంపై విమర్శలు కురిపించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగినప్పటికీ.. తమ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెప్పారు.

నిలబెట్టుకోగలిగే వాగ్దానాలు మాత్రమే చేయాలని కేంద్రాన్ని ఉద్దేశించి ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. ‘ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పెద్దఎత్తున హామీలు ఇస్తున్నారు. కానీ, ఏం చేస్తారు? ఏం లేదు. అగ్నిపథ్‌, అగ్నివీరులవంటి పెద్ద పెద్ద పేర్లతో పథకాలు తెస్తారు. యువతకు ఉద్యోగాలే లేనప్పుడు.. కేవలం రామనామ జపంతో ప్రయోజనం ఉండదు! శివసేన.. తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నడూ విస్మరించలేదు. అందుకే.. బలంగా కొనసాగుతోంది’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. అయితే, సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేంద్రం సైతం యువతకు భరోసా కల్పిస్తూ.. పదవీ విరమణ పొందే అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ ఏడాది జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని