Atal Setu: ‘అటల్‌ సేతు’ పిక్నిక్‌ స్పాట్‌ కాదు.. ముంబయి పోలీసుల హెచ్చరిక

అటల్‌ సేతుపై వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ముంబయి పోలీసులు హెచ్చరించారు.  

Updated : 16 Jan 2024 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతు (Atal Setu)పై వాహనదారుల వ్యవహారశైలి ఇబ్బందికరంగా మారింది. వంతెన మధ్యలో వాహనాలను ఆపి సెల్ఫీలు తీసుకొంటున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి అక్కడి రెయిలింగ్‌పైకి ఎక్కుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ చర్యలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. 

రిపబ్లిక్‌ డే రోజు దాడి చేస్తాం.. పంజాబ్‌ సీఎంకు బెదిరింపు

ఈ పోస్టులపై తాజాగా ముంబయి పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. అటల్‌ సేతు వంతెన మధ్యలో వాహనాలను ఆపితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ‘‘అటల్‌ సేతు వీక్షించదగ్గ ప్రదేశమే అని అంగీకరిస్తాము. కానీ, వంతెన మధ్యలో ఆగి ఫొటోలు తీసుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధం. ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌పై ఆగినట్లు తేలితే కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటల్‌ సేతు 21.8 కి.మీ. పొడవైన పిక్నిక్‌ స్పాట్‌ కాదు’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

వాస్తవానికి అటల్‌ సేతుపై దిగిన ఫొటోలకు సామాజిక మాధ్యమాల్లోను ప్రతికూల కామెంట్లు వస్తున్నాయి. ఇక్కడ కార్లను ఆపిన వారిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది నెటిజన్లు పోలీసులను కోరారు.  

ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవశేవాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్మాణం రెండు పాయింట్ల మధ్య దూరాన్ని గంటన్నర నుంచి 20 నిమిషాలకు తగ్గించింది. ఈ వంతెనపై గరిష్ఠ వేగం 100 కి.మీ.లు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీ.లుగా నిర్దేశించారు. సేవ్రీ నుంచి నవశేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు.  ఈ వంతెన నిర్మాణం కోసం రూ.17,840 కోట్లు వెచ్చించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని