Corona:చిన్నారులకు కొవిడ్‌ నుంచి రక్షణ ఇలా..

భారత్‌లో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చిన్నారుల్లో మహమ్మారి ప్రభావం చాలా తక్కువగా ఉంది. వారిలో సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి వారిని సంరక్షిస్తోంది. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ చిన్నారులకు కరోనా సోకకుండా నియంత్రించేందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published : 15 Jun 2021 01:12 IST

మార్గదర్శకాలు జారీ చేసిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ

దిల్లీ: భారత్‌లో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చిన్నారుల్లో మహమ్మారి ప్రభావం చాలా తక్కువగా ఉంది. వారిలో సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి వారిని సంరక్షిస్తోంది. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ చిన్నారులకు కరోనా సోకకుండా నియంత్రించేందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్నారుల్లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆయుష్‌ శాఖ తమ నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్‌ పలు రకాలుగా మ్యుటేట్‌ చెందుతున్న నేపథ్యంలో అందరూ కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని వారు సూచించారు.

తల్లిదండ్రులు ఏం చేయాలంటే..

కరోనా మహమ్మారి తీవ్రత, ప్రభావంపై చిన్నారులకు అవగాహన ఉండని కారణంగా తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుష్‌శాఖ సూచించింది. చిన్నారులు తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కు ధరించడం వంటి వాటిపై వారికి ఆసక్తి కలిగించాలని ఆయుష్‌ శాఖ తెలిపింది. వారికి ఈ జాగ్రత్తలు అలవాటయ్యేవరకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు తెలిపారు.  5 నుంచి 18 ఏళ్లలోపు వారికి మాస్కు తప్పనిసరి అని వారు పేర్కొన్నారు. అంత కంటే చిన్న వయసున్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని తెలిపారు. మూడు పొరలుండి ఆకర్షణీయంగా ఉండే మాస్కులను వారికి అందించాలన్నారు. వీలైనంత వరకు చిన్నారులు ఇళ్లల్లో ఉండేలా చూడాలని వారు సూచించారు. సన్నిహితులకు దగ్గరగా ఉండేందుకు వీడియో కాల్స్‌ మాట్లాడించాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

వ్యాయామం, వ్యక్తిగత శుభ్రత..

కరోనా నియంత్రణలో వ్యక్తిగత శుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు రెండు పూటలానోటిని బ్రష్‌ చేసుకోవడంతో పాటు వేడి నీటిని తాగాలని ఆయుష్‌ శాఖ సూచించింది. ప్రాణాయామం వంటి శ్వాసకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని వారు పేర్కొన్నారు. తాజా ఆహారంతో పాటు సరిపడినంత సమయం నిద్రకు కేటాయించాలని వారు సూచించారు.

ఒక వేళ చిన్నారులకు ఐదు రోజులకు పైగా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వైద్యులను సంప్రదించాలని ఆయుష్‌ శాఖ సూచించింది. లక్షణాలున్న చిన్నారులకు వృద్ధులకు దూరంగా ఉంచి పర్యవేక్షించాలని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని