Azadi Ka Amrit Mahotsav: ఆమె కోసం అంతా జైల్లోనే!
ఆంగ్లేయుల జైలు నుంచి విడుదల అనగానే ఎవరైనా సంబరపడి వెళ్లిపోతారు. కానీ విడిచి పెట్టినా వందలమంది జైల్లో అలాగే ఉండిపోయారు. కారణం- అరుణ! మహాత్ముడి నుంచి మామూలు కార్యకర్త దాకా అందరినీ కదిలించిన స్వాతంత్య్ర సమరయోధురాలు అరుణా అసఫ్ అలీ!
బ్రహ్మ సమాజ పద్ధతులు పాటించే సంప్రదాయ బెంగాలీ కుటుంబంలో 1909 జులై 16న జన్మించిన అరుణా గంగూలీ ఆది నుంచీ స్వేచ్ఛాభావనలతో ఎదిగారు. కలకత్తాలోని గోఖలే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. 1928లో న్యాయవాది అసఫ్ అలీతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. అది చాలామందిని ఆశ్చర్యపర్చింది. మతాలు వేరవటం ఒక కారణమైతే... ఇద్దరి మధ్యా వయసు అంతరం 20 ఏళ్లపైనే! అసఫ్ అలీ అప్పటికే మంచి న్యాయవాదిగా పేరుగాంచటమేగాకుండా... కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించేవారు. ఈ పెళ్లికి అరుణ కుటుంబం నిరాకరించింది. వీరి వివాహాన్ని హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనం అంటూ మహాత్మాగాంధీ తదితరులు ప్రశంసించగా... ఆ వ్యాఖ్యలను కూడా అంగీకరించకపోవటం అరుణ వ్యక్తిత్వానికి నిదర్శనం! ‘అసఫ్‌అలీని ముస్లిం మతాన్ని చూసి నేను పెళ్లి చేసుకోవటం లేదు. ఆయన గుణగణాలు నచ్చి చేసుకుంటున్నాను’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అరుణ!
పెళ్లి తర్వాత... భర్త అడుగుజాడల్లో స్వాతంత్య్రోద్యమంలోకి దిగారామె. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చాలామందితో పాటు అరెస్టయ్యారు. తర్వాత రాజకీయ ఖైదీలందరినీ ఆంగ్లేయ సర్కారు విడుదల చేసింది. కానీ... అరుణా అసఫ్‌అలీని మాత్రం జైల్లో అలాగే ఉంచింది. ఆమెతోపాటు జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేసినా బయటకు వెళ్లటానికి వారు నిరాకరించారు. అరుణను కూడా వదిలితేనే వెళతామంటూ పట్టుబట్టి సాధించుకున్నారు. ఆమెపై కన్నేసి ఉంచిన బ్రిటిష్ ప్రభుత్వం 1932లో మళ్లీ అరెస్టు చేసింది. ఈసారి తీహాఢ్ జైలుకు పంపించింది. అక్కడ రాజకీయఖైదీలకు సరైన సదుపాయాలు లేవంటూ నిరాహార దీక్షకు దిగటంతో... అంబాలాకు తరలించి విడిగా... కఠిన పరిస్థితుల మధ్య కారాగారంలో ఉంచారు. అక్కడ ఆరోగ్యం పాడవటంతో... విడుదలయ్యాక దాదాపు పదేళ్లపాటు అరుణ ఉద్యమానికి దూరంగా ఉంటూ వచ్చారు.
నాయకులెవరూ లేనివేళ..
1942 ఆగస్టు 8న బొంబాయిలో కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించగానే... ఆంగ్లేయ సర్కారు అనూహ్యంగా విరుచుకుపడింది. ఈ ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేసేందుకు నడుంబిగించింది. అప్పటికప్పుడు గాంధీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్టు చేసింది. ఉద్యమానికి నాయకత్వం వహించేవారు లేకుండా చేసి... నిర్వీర్యం చేయాలని ఎత్తుగడ వేసింది. నాయకులంతా... జైళ్లకు వెళ్లటంతో కార్యకర్తలు అగమ్యమయ్యారు. ఏం చేయాలో అర్థంగాని ఆ పరిస్థితుల్లో... అనూహ్యంగా అరుణా అసఫ్‌అలీ తెరపైకి వచ్చారు. పదేళ్లుగా ఉద్యమానికి దూరంగా ఉంటున్న ఆమె గురించి ఆంగ్లేయ పోలీసులు మరచిపోయారు. ఆగస్టు 9న పార్టీ సదస్సును నడిపించిన ఆమె... ధైర్యంగా... బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి... గాంధీజీ ప్రకటించిన క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అది మొదలుగా... బొంబాయిలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా అగ్ని రగిలింది. ఊహించని ఈ పరిణామంతో అవాక్కయిన ఆంగ్లేయులు అరుణ అరెస్టుకు వారెంట్ జారీ చేశారు. ఈ విషయాన్ని ఊహించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలో ఉంటూ మరింత చురుగ్గా వ్యవహరించారు. రామ్ మనోహర్ లోహియాతో కలసి కాంగ్రెస్ పార్టీ మాసపత్రిక ఇంక్విలాబ్‌ను నిర్వహించారు. అరుణను ఎలాగైనా పట్టుకోవాలని కంకణం కట్టుకున్న ఆంగ్లేయ ప్రభుత్వం... ఆమె తలకు రూ.5వేల వెలకట్టింది. అంతేగాకుండా ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేసింది. ఆమెను మాత్రం పట్టుకోలేకపోయింది. అజ్ఞాతంలో ఉంటూ... మార్క్సిజానికి దగ్గరైన అరుణ ఆరోగ్యం దెబ్బతింది. విషయం తెలిసిన గాంధీజీ ఆమెకు స్వయంగా లేఖ రాశారు. ‘‘నువ్వు చూపిన ధైర్య సాహసాలు తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. కానీ... ఆరోగ్యంపాడై... అస్థిపంజరంలా తయారయ్యావని విని ఆందోళనగా ఉంది. మన లక్ష్యం దాదాపు నెరవేరేలా ఉంది. అజ్ఞాతం వీడి లొంగిపో... నీ తలపై కట్టిన వెలను అంటరానితనం నిర్మూలనకు ఉపయోగించు’’ అని సందేశం పంపించారు. కానీ అరుణ అందుకు అంగీకరించలేదు. తన తలకు వెలను తొలగించి, అరెస్టు వారెంటు వెనక్కి తీసుకునేదాకా అజ్ఞాత పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. చివరకు ఆంగ్లేయ సర్కారు ఆమె పట్టుదల ముందు లొంగక తప్పలేదు. 1946లో బయటకు వచ్చిన వెంటనే... బొంబాయి నౌకాదళ తిరుగుబాటులో పాల్గొన్నారు అరుణ. స్వాతంత్య్రానంతరం... కమ్యూనిస్టు పార్టీలో చేరి... మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1958లో దిల్లీ తొలి మేయర్‌గా వ్యవహరించినా... రాజకీయ ఒత్తిళ్లలో పనిచేయలేక వదిలేశారు. మరణించిన మరుసటి ఏడాది 1997లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rajeev Kanakala: 'లవ్‌స్టోరీ’లో బాబాయ్ పాత్ర.. ఇబ్బంది పడ్డా!: రాజీవ్ కనకాల
-
Ap-top-news News
Lambasingi: మన్యంలో మంచు దుప్పటి!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్చేయండి
-
Ap-top-news News
Andhra News: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు
-
Crime News
Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!