Bengaluru: ట్రాఫిక్ ఎఫెక్ట్‌.. భారీగా నష్టపోతున్న బెంగళూరు..!

బెంగళూరు(Bengaluru) నగరం ట్రాఫిక్‌ వల్ల భారీగా నష్టపోతోంది. అక్కడ భారీగా పెరుగుతోన్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన ఉండకపోవడమే అందుకు కారణమని ఓ సర్వే వెల్లడించింది. 

Updated : 07 Aug 2023 12:46 IST

బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరు(Bengaluru )లో ట్రాఫిక్‌(Traffic)ను దాటుకొని, గమ్యస్థానాలకు చేరాలంటే కొన్నిగంటలు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిపై నెటిజన్లు తాము ఎదుర్కొన్న అనుభవాలు సోషల్‌ మీడియాలో పంచుకోవడం చూస్తూనే ఉంటాం. ఇలా ట్రాఫిక్ అంతరాయాలు, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం వంటి వాటి వల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో బెంగళూరు నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్‌ శ్రీహరి, ఆయన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రోడ్‌ ప్లానింగ్‌, ఫ్లైఓవర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, మౌలిక సదుపాయాల లోటు వంటి అంశాలను పరిశీలించిన మీదట ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇండిగో విమానంలో ఏసీ బంద్‌..

దాదాపు పూర్తిస్థాయిలో పనిచేసే 60 ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ.. బెంగళూరు(Bengaluru) నగరం ఏటా దాదాపు రూ. 20 వేలకోట్ల రూపాయల భారీ నష్టాన్ని చవిచూస్తోందని ఆ బృందం వెల్లడించింది. ఐటీ రంగంలో వృద్ధితో నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దాని వల్ల ఇతర సౌకర్యాలు మెరుగవుతున్నాయని తెలిపింది. భారీగా పెరిగిన జనాభాకు తగ్గట్టుగా.. వాహనాల సంఖ్య 1.5 కోట్లకు చేరువగా ఉంది. దానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ లేదని ఆ బృందం గుర్తించింది. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటూ వేగంగా పెరుగుతోన్న జనాభాకు తగ్గట్టుగా జరుగుతోన్న మౌలిక సదుపాయాల కల్పన సరిపోవడం లేదని, ఆ వ్యత్యాసమే ఈ ట్రాఫిక్ అంతరాయాలకు కారణమవుతోందని పేర్కొంది.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. బెంగళూరు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇక్కట్ల గురించి వివరించారు. ఆ అంతరాయాలను తొలగించేందుకు వీలుగా వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని కేంద్రమంత్రి.. శివకుమార్‌కు సూచించారు. ఈ క్రమంలోనే శ్రీహరి బృందం ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్లానింగ్‌పై శివకుమార్‌కు నివేదిక ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని