అర్ధరాత్రి రోడ్డుపై నడిచి వెళ్తున్న దంపతులకు ₹3వేలు ఫైన్‌.. ఇద్దరు పోలీసులపై వేటు!

బెంగళూరులో ఓ జంటకు పోలీసుల నుంచి భయానక అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా పలు ప్రశ్నలతో వేధించిన పోలీసులు వారికి రూ.3వేలు జరిమానా విధించి చివరకు సస్పెండ్‌ అయ్యారు. అసలేం జరిగిందంటే?

Published : 12 Dec 2022 01:11 IST

బెంగళూరు: మెట్రో నగరాల్లో(Metro cities) అర్ధ రాత్రయినా జనసంచారం సర్వసాధారణమే..! ఆఫీసుల్లో పని పూర్తి చేసుకొని ఇళ్లకు వచ్చేవారు కొందరుంటే.. విందులు, వినోద కార్యక్రమాలకు వెళ్లి ఆలస్యంగానైనా ఇంటికి చేరుకోవాలనుకొనేవారు మరికొందరుంటారు. అయితే, బెంగళూరు(Bengaluru)లో అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులకు అక్కడి పోలీసుల నుంచి వింత అనుభవం ఎదురైంది. ఓ బర్త్‌డే పార్టీ(Birthday Party)కి హాజరై రాత్రి సమయంలో తన భార్యతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు(Police) తమకు రూ.3వేలు ఫైన్‌ విధించడమే కాకుండా వేధింపులకు గురిచేసినట్టు కార్తీక్‌ పత్రీ అనే వ్యక్తి వాపోయారు. ఆరోజు రాత్రి పోలీసుల నుంచి తమకు ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్‌(twitter)లో వివరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఈ ట్వీట్‌పై బెంగళూరు పోలీస్‌(Bengaluru Police) ఉన్నతాధికారులు స్పందించారు. ఆ దంపతుల్ని వేధింపులకు గురిచేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు.

ఆ రాత్రి అసలేం జరిగిందంటే..?

డిసెంబర్‌ 8న అర్ధరాత్రి పోలీసుల నుంచి తమకు ఎదురైన వేధింపులపై బాధితుడు కార్తీక్‌ పత్రీ తన ట్విటర్‌లో వివరించారు. దీనిపై డిసెంబర్‌ 9న వరుసగా 15 ట్వీట్లు చేశారు. ఆయన ఏం రాశారంటే.. ‘‘నిన్న (ఈనెల 8న) రాత్రి నాకూ నా భార్యకు ఎదురైన ఓ భయానక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నా ఫ్రెండ్‌ పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో  కేక్‌ కటింగ్‌ కార్యక్రమానికి వెళ్లి మాన్యతా టెక్‌ పార్కు వెనుక ఉన్న సొసైటీలోని మా ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం. మా ఇంటికి కొద్ది మీటర్ల దూరంలోనే సొసైటీ గేటు వద్ద ఓ పెట్రోలింగ్‌ వాహనం ఆగి ఉంది. యూనిఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు మమ్మల్ని ఆపారు. ఐడీ కార్డులు చూపించాలని అడిగారు. సాధారణ రోజుల్లో వీధుల్లో తిరిగేందుకు దంపతులు ఐడీ కార్డులు ఎందుకు చూపించాలి?’’ అని కార్తీక్‌ పత్రీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రాత్రి 11దాటితే రోడ్డుపై నడవొద్దట!

‘‘మా ఐడీ కార్డుల్ని చూపించినా పోలీసులు మా ఫోన్లను లాక్కొని మా మధ్య సంబంధం, ఎక్కడ పనిచేస్తున్నాం, తల్లిదండ్రుల వివరాలు, ఇతర సమాచారం గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. కాస్త తడబడినా వారు అడిగిన ప్రశ్నలకు మర్యాదగానే సమాధానాలు చెప్పాం. అదే సమయంలో ఒక పోలీస్‌ చలాన్‌బుక్‌లా ఉన్న దాన్ని తీసి మా పేర్లు, ఆధార్‌ నంబర్లను రాయడం మొదలుపెట్టారు. దీంతో మాకు ఎందుకు చలాన్లు రాస్తున్నారని  అడిగాం. రాత్రి 11 గంటల తర్వాత తిరగకూడదని పోలీసులు చెప్పారు. అలాంటి రూల్‌ ఉందా? మాకు తెలియదని మేం చెప్పాం. మీ లాంటి అక్షరాస్యులు ఇలాంటి నియమాలు తెలుసుకోవాలని పోలీసులు మాకు సూచించారు’’ అని తెలిపారు.

నా భార్య ఏడ్చింది.. చివరకు పోలీసులకు రూ.1000 ఇచ్చా..!

‘‘అలాంటి రూల్‌ ఒకటి ఉందని మాకు తెలియనందున పోలీసులకు క్షమాపణ చెప్పాం. రాత్రి పూట ఇలా రోడ్లపై నడుస్తూ తిరగబోమని కూడా మేం పోలీసులకు చెప్పాం. అంతటితో ఈ ఇష్యూ సమసిపోతుందని అనుకున్నాం. కానీ ఆ ఇద్దరు పోలీసులూ ఇలాంటి ఒక సందర్భం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా మాకు అనిపించింది. ఎంతగా బతిమిలాడినా వారు కనికరించలేదు. పైగా రూ.3వేలు జరిమానా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మమ్మల్ని వదిలేయాలని ఎంతగా బతిమిలాడినా కనికరించలేదు. మమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. చాలా వేధింపులకు గురిచేశారు. ఇద్దరు దోషుల ఫొటోలు చూపించి డబ్బులు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఒకానొక దశలో నా భార్య ఏడ్చేసింది. ఆమె అలా ఏడవడంతో ఏమైనా చిక్కుల్లో పడతామని భావించారేమో గానీ.. ఆ పోలీసులు తమ పంథాను మార్చారు. నాకు మాత్రమే పెనాల్టీ పడుతుందని చెప్పారు.

డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి నన్ను పక్కకు తీసుకెళ్లి కనీస మొత్తమైనా చెల్లించాలని సలహా ఇచ్చాడు. దీంతో వాళ్లతో వాదించి మానసికంగా నేను కుంగిపోయి ఉన్నా. ఓ వైపు నా భార్య ఏడుస్తోంది. ఇంకా దీన్ని పొడిగించడం ఎందుకని చివరికి రూ.1000లు చెల్లించేందుకు అంగీకరించాను. దీంతో వెంటనే అక్కడ ఉన్న పోలీస్‌ నా దగ్గరకు పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ తీసుకొచ్చి నిలబడ్డాడు. పేమెంట్‌ చేసినా నేను, నా భార్య రోడ్డుపై అర్ధరాత్రి నడుస్తూ కనిపిస్తే మరింత కఠినమైన  కేసు నమోదు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఆ రాత్రి ఇంటికి వెళ్లాక కూడా మాకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు పనిపైనా దృష్టిపెట్టలేకపోయాం. ఈ ఘటన మా మనసులో తీవ్ర గాయాన్ని మిగిల్చింది. చట్టాన్ని అమలు చేసే సంస్థలపై మా విశ్వాసం చెల్లాచెదురైంది. నిజాయతీపరులు, చట్టానికి కట్టుబడి ఉండే పౌరుల పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? చట్టాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఉల్లంఘించి అభాగ్యుల్ని వేటాడుతుంటే ఇక ఎవరిని ఆశ్రయించాలి?’’ అని అని ప్రశ్నిస్తూ బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌, బెంగళూరు పోలీసులను కార్తీక్‌ పత్రీ ట్యాగ్‌ చేశారు.

ఆ ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్‌ చేశాం: బెంగళూరు సిటీ పోలీస్‌

దీంతో అతడి ట్వీట్లపై బెంగళూరు నగర పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆ ఇద్దరు పోలీసులు సంపిగెహల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందినవారిగా గుర్తించామని.. వారిని సస్పెండ్‌ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ప్రవర్తనను తాము ఎప్పటికీ సహించబోమని పేర్కొంటూ బెంగళూరు సిటీ పోలీసులు ట్వీట్‌ చేశారు.  మరోవైపు, ఈ ఘటనపై బెంగళూరు నార్త్‌ఈస్ట్‌ డీసీపీ అనూప్‌ ఎ శెట్టి స్పందించారు. ఈ ఘటనను తమ దృష్టికి తీసుకొచ్చిన కార్తీక్‌ పత్రీకి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు