G20 venue: జీ20 వేదిక వద్ద వరదనీటి వీడియో.. కేంద్రం ఏం చెప్పిందంటే..?

G20 venue: భారత్‌ మండపం వద్ద వర్షపునీరు నిల్వడంపై కాంగ్రెస్ విమర్శలు చేయగా.. కేంద్రం వాటిని ఖండించింది. దీనికి సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్  చెక్‌ స్పందించింది. 

Published : 11 Sep 2023 11:57 IST

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు కొత్తగా నిర్మించిన ‘భారత్‌ మండపం’లో కొద్దిపాటి వర్షానికే నీరు చేరిందంటూ కాంగ్రెస్‌(Congress) విమర్శలు గుప్పించింది. అలాగే ఒక వీడియోను కూడా విడుదల చేసింది. నీటితో నిండిన కారిడార్లలో అధికారులు నడుచుకుంటూ వెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. అయితే ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. (G20 venue)

విపక్షాలు చేస్తోన్న విమర్శల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్ చెక్‌ (PIB Fact Check) విభాగం నిర్థారించింది. ఈ వీడియోలోని దృశ్యాలు తప్పుదోవపట్టించేలా ఉన్నాయని పేర్కొంది. రాత్రి సమయంలో కురిసిన వర్షాలతో జీ20 వేదిక ప్రాంగణంలో కొద్దిపాటి నీరు చేరిందని, ఆ నీటిని తొలగించినట్లు వెల్లడించింది. ప్రస్తతం అక్కడ నీరు నిలిచిలేదని చెప్పింది.

ఈసారి ఓడే ప్రసక్తే లేదు: కమల్‌హాసన్‌

భారత్‌ మండపం వద్ద కొద్దిపాటి వర్షానికే నీరు నిల్వడమనేది మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన ‘డొల్ల అభివృద్ధి’కి నిదర్శనమని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. ఈ ప్రాంగణాన్ని నిర్మించడానికి రూ.2,700 కోట్లు ఖర్చు అయిందని,  అంత డబ్బు దోచుకొని, ఇంత నాసిరకంగా పనులు చేసిందెవరని ప్రశ్నించింది. భయం కారణంగా ఈ దేశ ప్రజలు మీకు చెప్పలేని ఒక విషయాన్ని భగవంతుడే సెలవిచ్చాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) మండిపడగా..  కొద్దిపాటి వర్షానికే ‘అభివృద్ధి’ తేలియాడుతోందని మరో నేత రణదీప్‌ సూర్జేవాలా ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని