Center vs Delhi: మరోసారి సుప్రీంకు చేరిన ‘దిల్లీ అధికారాల’ పంచాయితీ

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం(Center vs Delhi) మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తమ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఆప్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.  

Published : 20 May 2023 16:27 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్‌(Center vs Delhi) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు వచ్చినా ఓ కొలిక్కిరాలేదు.  దాంతో ఆ పంచాయితీ మరోసారి అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. 

దిల్లీ(Delhi)లో ప్రభుత్వాధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చర్యలు ప్రారంభించారు. సేవల విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరెను బదిలీ చేశారు. కానీ దానికి కేంద్రం అడ్డుతగిలింది. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ శుక్రవారం కేంద్రం ఆర్డినెస్స్(ordinance) తీసుకువచ్చింది. ఆ వెంటనే ఇటీవల వచ్చిన కీలక తీర్పుపై సమీక్ష కోరుతూ  శనివారం  సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసింది. 

ఇక ఈ ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లేందుకు దిల్లీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో ఆమోదం పొందదని కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తోన్న అభిషేక్ సింఘ్వీ అన్నారు. ‘మీరు మ్యాచ్‌ ఓడిపోయినప్పుడు..నిబంధనలు మార్చుతుంటారు’అని కేంద్రంపై విమర్శలు చేశారు. 

ఇదిలా ఉంటే.. కేంద్రం ఆర్డినెన్స్(ordinance) ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. అది బదిలీలు, నియామకాలపై నిర్ణయం తీసుకుంటుంది. దానిలో ముఖ్యమంత్రి(ఛైర్‌పర్సన్‌), చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజార్టీ ఓటు ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ ద్వారా తేలని అంశం ఉంటే.. దానిపై తుది నిర్ణయాధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని