UPSC: సివిల్స్‌ అభ్యర్థుల ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలో సత్తా చాటిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 02 May 2024 12:20 IST

UPSC Civil Services | దిల్లీ: ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌-2023 మెయిన్‌ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ.. తాజాగా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ప్రకటించింది. మెయిన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16వరకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది.   ఇంటర్వ్యూలకు మొత్తంగా 2,844 మంది అర్హత సాధించగా.. తొలుత 1026 మంది అభ్యర్థులకు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలకు సంబంధించి 1026 మంది అభ్యర్థులకు త్వరలోనే ఈ-కాల్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు UPSC ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థనలు స్వీకరించబోమని స్పష్టంచేసింది.  ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా సంబంధిత ఖర్చులను రియంబర్స్‌ చేస్తామని.. రైళ్లలో సెకెండ్‌/స్లీపర్‌ తరగతుల్లో ప్రయాణానికే డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపింది. 

గత మే నెలలో జరిగిన UPSC civils ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. దేశ వ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది హాజరయ్యారు. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. సెప్టెంబరు 15 నుంచి 24వ తేదీ వరకు మెయిన్‌ పరీక్షలు జరిగాయి. ఆ ఫలితాలు డిసెంబర్‌ 8న విడుదల చేసిన యూపీఎస్సీ.. తాజాగా ఇంటర్వ్యూలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది.  తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు అభ్యర్థులు అర్హత సాధించినట్టు అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని