తదుపరి సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ

Updated : 24 Mar 2021 14:25 IST

దిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్‌ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 

సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని