Delhi Police: దిల్లీ పోలీసుల కోడ్‌భాషలో పాండోరా.. సమర అంటే ఏమిటో తెలుసా..?

జీ20లో భద్రతా లోపాలు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలీసులు ముఖ్యప్రదేశాలకు మారు పేర్లు పెట్టారు. పోలీసులు రోడ్లపై మాట్లాడే రేడియో సెట్ల ద్వారా ప్రముఖుల కదలికలు లీక్‌ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకొన్నారు. 

Updated : 12 Sep 2023 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాండోర.. సమర.. పారామౌంట్‌.. జీ20 (G20) సదస్సు సమయంలో దిల్లీ పోలీసుల (Delhi Police) సంభాషణల్లో ఇలాంటి పదాలు తరచూ వినిపించాయి.. ఇవన్నీ వీవీఐపీల కోసం వాడిన కోడ్‌ వర్డ్స్‌. దిల్లీలోని ప్రముఖ హోటల్‌ పేర్లు మొత్తం ప్రజలకు తెలిసినవి కావడంతో అధికారులు వాటిని కోడ్‌నేమ్‌లతో వ్యవహరించారు. తాజాగా దేశ రాజధానిలో భద్రతా వలయాలను తొలగించిన తర్వాత కొందరు అధికారులు నేడు ఓ ఆంగ్లపత్రికకు ఈ విషయం వెల్లడించారు. 

ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన తొలి 20దేశాల అగ్రనేతలు హాజరయ్యే సదస్సు వద్ద భద్రతా వలయాలను దాటుకొని పోవడం దాదాపు అసాధ్యం. దీంతోపాటు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, యూకే పీఎం రిషి సునాక్‌, సౌదీ యువరాజు సల్మాన్‌ వంటి వీవీవీఐపీ అతిథుల విడిది వద్ద రక్షణ ఏర్పాట్లు కీలకం. ఈ నేపథ్యంలో వారి సమాచారం రేడియో సెట్లలో లీక్‌కాకుండా ప్రత్యేకంగా కోడ్‌ పదాలను పెట్టుకొన్నారు. వీటిని ముందుగానే నిర్ణయించి పీఎం, ఎన్‌ఎస్‌జీ, దిల్లీ సెక్యూరిటీ అధికారులకు తెలియజేశారు. పోలీసుల్లో కూడా జూనియర్‌ స్థాయి అధికారులకు వీటి వివరాలను ఇవ్వలేదు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విడిది చేసిన ఐటీసీ మౌర్యాకు అధికారులు పెట్టిన కోడ్‌నేమ్‌ ‘పాండోరా’. ఇక యూకే ప్రధాని రిషి సునాక్‌ బసచేసిన షంగ్రి-లా హోటల్‌ను ‘సమర’, నైజిరియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, మారిషస్‌ నేతలు ప్రపంచ బ్యాంక్‌ అధికారులు విడిది చేసిన మెరిడియన్‌ను ‘మహాబోధి’గా.. యూఏఈ యువరాజు ఉన్న తాజ్‌ మాన్‌ సింగ్‌ను పారామౌంట్‌గా పిలుచుకొన్నారు. దీంతోపాటు ది లలిత్‌, ది గ్రాండ్‌ వంటి ఇతర హోటళ్లకు కూడా ఇలా కోడ్‌ వర్డ్స్‌ పెట్టుకొన్నారు. ప్రపంచ నేతలు సందర్శించిన రాజ్‌ఘాట్‌ను రుద్‌పుర్‌గా వ్యవహరించారు. జీ20 ప్రధాన వేదికైన ప్రగతి మైదాన్‌ను ‘నికేతన్‌’ అని పిలిచారు. 

కెనడా ప్రధాని ట్రూడోకు వరుస షాక్‌లు..!

ఈ సదస్సు సమయంలో రెండు సందర్భాల్లో భద్రతా లోపాలు చోటు చేసుకొన్నాయి. ఒక సారి బైడెన్‌ కాన్వాయ్‌లోని కారు డ్రైవర్‌ మరో వీఐపీ బసచేసిన హోటల్‌ వద్దకు వెళ్లాడు. మరోసందర్భంలో సౌదీ యువరాజ బస చేసిన హోటల్‌లో అదే దేశానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అనుకోకుండా యువరాజు వద్దకు వెళ్లాలని యత్నించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని