canada: కెనడా ప్రధాని ట్రూడోకు వరుస షాక్‌లు..!

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో న్యూదిల్లీలో జరిగిన జీ20 సద్సస్సును అంత తేలిగ్గా మర్చిపోలేరు. సదస్సులో చేదు అనుభవాలకు తోడు.. ఆయన విమానం మొరాయించడంతో రెండు రోజులు అదనంగా దిల్లీలోని ఉండిపోవాల్సి వచ్చింది.

Published : 12 Sep 2023 12:46 IST

మన టైమ్‌ బాగోలేకపోతే ఎక్కడ ఎక్కువ సేపు ఉండకూడదనుకుంటామో.. అక్కడే రోజుల తరబడి గడపాల్సి వస్తుంది. ప్రస్తుతం కెనడా (canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau ) పరిస్థితి ఇదే. జీ20 ఘనంగా ముగిసింది.. అతిథులు అందరూ వెళ్లిపోయారు.. ఒక్క ట్రూడో తప్ప. ఆయన అధికారిక విమానంలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం కూడా ఆయన బయల్దేరడం అనుమానమే. ట్రూడో కోసం మరో విమానాన్ని కెనడా ఎయిర్‌ఫోర్స్‌ పంపింది. దీనిని తొలుత రోమ్‌ మీదుగా దిల్లీకి చేర్చాలని భావించారు. కానీ, ఆ తర్వాత మార్గం మార్చి లండన్‌ రూట్‌ వైపు మళ్లించారు.

జీ20 సదస్సులో కూడా అంటీ ముట్టనట్లు..

  • ట్రూడో వ్యవహారశైలి జీ20లో కూడా అంటీ ముట్టనట్లు ఉంది. ఆయన సదస్సు తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా హాజరు కాలేదు. దీనికి కారణం చెప్పేందుకు కెనడా ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించిందని అక్కడి పత్రికలు కథనాలు రాశాయి.
  • ఇక ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు. దీంతో ప్రధాని మోదీ ఆయన్ను చేయి పట్టుకొని అక్కడి విశేషాలు వివరించేందుకు యత్నించారు. కానీ, ట్రూడో సున్నితంగా చేయి వెనక్కి తీసుకోవడంతో మోదీ కూడా మిన్నకుండిపోయారు. ఈ ఘటనపై విలేకర్లు ట్రూడోనే నేరుగా ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనుకోవచ్చని సమాధానమిచ్చారు. 
  • జీ20 చివరి రోజున మోదీ-ట్రూడో భేటీ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఈ భేటీలో మోదీ నేరుగా ట్రూడో వద్దే భారత్‌ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని ప్రస్తావించారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. దౌత్యవేత్తలపై దాడులు, దౌత్యకార్యాలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌-కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటన రూపంలో విడుదల చేయడం గమనార్హం.
  • తాజాగా ట్రూడో దిల్లీలో ఉండగానే కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి బెదిరింపులు రావడం మరింత ఇబ్బందికరంగా మారింది.
  • ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలు ఆయన్ని పట్టించుకోలేదని.. ఇది అవమానకరమని కెనడా ప్రతిపక్ష నేత పెర్రి పొయిలివ్రే ఎద్దేవా చేశారు.  

పర్యటనకు ముందే కొన్ని ఘటనలు..

ఈ పర్యటనకు కొద్ది రోజుల ముందే తాము భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కెనడా ప్రకటించింది. దీనికి సరైన కారణం వెల్లడించలేదు. ఇక జులైలో కెనడాలోని ఖలిస్థానీ గ్రూపులు భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ పోస్టర్లు జారీ చేశాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పందిస్తూ.. ఇరు దేశాల సంబంధాలపై ఈ ఘటన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.

2018లోనూ వివాదాస్పదమే..

2018లోనూ భారత్‌ పర్యటనలో ట్రూడో భారీగా విమర్శల పాలయ్యారు. అప్పట్లో ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్‌ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్‌ అత్వాల్‌ను ఆహ్వానించారు. ఇది ట్రూడోను దౌత్యపరమైన చిక్కుల్లోకి నెట్టింది. ఈ ఘటనల కారణంగా భారత్‌ ప్రభుత్వం అప్పట్లో ఆయన పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అధికారిక కార్యక్రమాలు తక్కువగా జరిగాయి. పర్యటక ప్రాంతాల సందర్శన కోసం ట్రూడో భారత్‌ వెళ్లినట్లుందని స్వదేశంలో విమర్శలను ఎదుర్కొన్నారు.

చైనా బెల్ట్‌కు చెక్‌!

ఇక కెనడా అధికారిక విమానాల విషయానికొస్తే అవి ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2016లో బెల్జియం బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యతో తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. ఇక 2019 అక్టోబర్‌ ఈ విమానం ఓ గోడను పొరబాటున ఢీకొంది. అప్పట్లో దీని ముక్కుభాగం దెబ్బతింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని