Mamata: సీపీఎంను ఎన్నడూ క్షమించను.. అందుకే కాంగ్రెస్‌తో కటీఫ్‌: దీదీ

సీపీఎంను తాను ఎప్పటికీ క్షమించబోనన్న బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. తన ప్రతిపాదనను తిరస్కరించడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం లేదన్నారు.

Updated : 31 Jan 2024 17:55 IST

కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాను బలోపేతం చేసేందుకే సీపీఎంతో కలిసి కాంగ్రెస్‌ పనిచేస్తోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. తాను ప్రతిపాదించిన రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నిరాకరించడంతోనే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం.. ప్రజలను ఎంతో వేదనకు గురి చేసిందని విమర్శలు గుప్పించారు. అందుకే ఆ పార్టీని తాను ఎన్నడూ క్షమించనని ఉద్ఘాటించారు.

ఎప్పటికీ క్షమించను..

‘అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయినప్పటికీ వారికి రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాను. కానీ, వాళ్లు మరిన్ని కావాలని అడగడంతో ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పాను. సీపీఎంను ఎన్నడూ క్షమించను. ఎందుకంటే.. మూడున్నర దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రజలను ఎన్నోవిధాలుగా హింసించారు. వారికి మద్దతుగా నిలిచేవాళ్లపైనా కనికరం చూపించను. భాజపాను బలోపేతం చేసేందుకు సీపీఎంతో కలిసి కాంగ్రెస్‌ పనిచేస్తుంది. రాష్ట్రంలో భాజపాను రాజకీయంగా ఎదుర్కొనే సామర్థ్యం టీఎంసీకి ఉంది’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

కేంద్రానికి అల్టిమేటం..

వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగు బకాయిలపైనా మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.  రాష్ట్రానికి రూ.7వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని ఫిబ్రవరి 1 నాటికి విడుదల చేయకుంటే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఉద్యమం ద్వారా వాటిని ఎలా సాధించాలో తనకు తెలుసునన్నారు. ఫిబ్రవరి 2న చేసే ధర్నాలో అందరూ పాల్గొనాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు