Salman Khurshid: చల్లారని పుస్తక వివాదం.. మాజీ మంత్రి ఇంటికి నిప్పు!

తన రచనలో హిందూత్వను తీవ్రవాద ఇస్లామిక్‌ సంస్థలతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలూ వస్తున్నాయి. తాజాగా సోమవారం ఉత్తరాఖండ్‌ నైనితాల్‌లోని...

Updated : 24 Sep 2022 15:28 IST

దిల్లీ: తన రచనలో హిందుత్వను తీవ్రవాద ఇస్లామిక్‌ సంస్థలతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలూ వస్తున్నాయి. తాజాగా సోమవారం ఉత్తరాఖండ్‌ నైనితాల్‌లోని ఆయన ఇంటిని కొంతమంది ధ్వంసం చేసి, నిప్పంటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఖుర్షీద్‌ స్వయంగా సామాజిక మాధ్యమాల వెల్లడించారు. ఇంట్లో మంటల దృశ్యాలు, కాలిపోయిన తలుపులు, పగిలిన కిటికీల అద్దాల ఫొటోలు, వీడియోలనూ ఆయన పోస్ట్ చేశారు. ‘ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో.. అలాంటి స్నేహితులతో చర్చల కోసం ఈ ఇంటి తలుపులు తెరవాలని ఆశించా. ఇది హిందూయిజం కాదని నేను చెప్పింది తప్పంటారా?’ అంటూ రాసుకొచ్చారు.

20 మందిపై కేసు నమోదు..

ఈ ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ సైతం స్పందిస్తూ.. ‘ఇది అవమానకరం. మన రాజకీయాల్లో పెరుగుతున్న అసహనం స్థాయిలను అధికారంలో ఉన్నవారు ఖండించాలి’ అని ట్వీట్‌ చేశారు. ఖుర్షీద్‌ ఇంటిపై దాడి వ్యవహారంలో డీజీఐ నీలేష్ ఆనంద్‌ వివరణ ఇస్తూ.. ఈ ఘటనలో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయోధ్య కేంద్ర బిందువుగా సల్మాన్‌ ఖుర్షీద్‌ తాజా పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య.. నేషన్‌హుడ్ ఇన్‌ అవర్ టైమ్స్’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అందులో హిందుత్వను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భాజపా, ఇతర సంస్థల నేతలు విమర్శలకు దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని