Updated : 22 Mar 2021 15:10 IST

‘జనతా కర్ఫ్యూ’కు ఏడాదైన వేళ..!

దేశంలో సెకండ్‌ వేవ్‌ ఆందోళన..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం యావత్‌ దేశం ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది మార్చి 22న పూర్తి లాక్‌డౌన్‌ విధించి నేటికి ఏడాది గడుస్తోంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని అలాంటి రోజును ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటుండగా, ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ ఆంక్షలు సాధారణమైపోయాయి.

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా గతేడాది మార్చి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించింది. దీంతో యావత్‌ దేశం పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. కొవిడ్‌ మహమ్మారిపై పోరులో కీలక భూమిక పోషిస్తోన్న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేస్తోన్న వారికి మద్దతుగా ఆ రోజు సాయంత్రం దేశ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు, గంటలతో సానుభూతి తెలియజేశారు. ఈ లాక్‌డౌన్‌ మరో 21 రోజుల పాటు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో యావత్‌ దేశం స్తంభించిపోయింది. దుకాణాలు, పాఠశాలలు, కార్యాలయాలు, మాల్స్‌, సినిమా హాళ్లతో పాటు రైల్వేలు, విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఈ లాక్‌డౌన్‌ మే 31వరకు కొనసాగింది. అనంతరం పలు దఫాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. అలా జనతా కర్ఫ్యూతో మొదలైన ఆంక్షల పరంపర ప్రస్తుతం కరోనా వైరస్‌ రెండో తరంగం‌ విజృంభిస్తోన్న వేళ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

సెకండ్‌ వేవ్‌ ఆందోళన..

దేశంలో తొలిసారి ‘జనతా కర్ఫ్యూ’ విధించిన నాటికి వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉంది. అనంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దాదాపు కోటి మందికిపైగా ప్రజల్లో ఈ వైరస్‌ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర మందిని ఈ మహమ్మారి కబళించింది. తొలుత కొన్ని నెలలపాటు వైరస్‌ తీవ్రత పెరిగి, జనవరి నాటికి తగ్గుముఖం పట్టింది. కానీ, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ మొదలు కావడంతో ఆయా రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే, ఈసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండదని ఇప్పటికే నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కేవలం వైరస్‌ తీవ్రత ఉండే జిల్లాలు, స్థానిక కంటైన్‌మెంట్‌ జోన్ల వారిగానే ఆంక్షలు విధించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత, పలు రాష్ట్రాల్లో విధిస్తోన్న ఆంక్షల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

* దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 47వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రికవరీల కంటే పాజిటివ్‌ కేసులు భారీగా బయటపడడం వరుసగా ఇది 12వ రోజు కావడం ఆందోళన కలిగించే విషయం.

* గతేడాది నవంబర్‌ 11 తర్వాత అత్యధికంగా రోజువారీ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దాదాపు 130 రోజుల అనంతరం రికార్డు స్థాయి కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3.34లక్షలకు పెరిగింది.

ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో దాదాపు 2 లక్షల కేసులు గడిచిన ఐదు రోజుల్లో నమోదైనవి కావడం ఆందోళన కలిగించే విషయం.

* పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పాటే కొవిడ్‌ మరణాలు కలవరపెడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 212మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. గత 72రోజుల్లో రోజువారీ కొవిడ్‌ మరణాల్లో ఇదే అత్యధికం.

గడిచిన నాలుగు నెలలుగా దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రకటించింది. కానీ, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు ఐదు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ పెరిగింది.

ఇప్పటికే కరోనా విలయాన్ని చవిచూపిన మహారాష్ట్ర, సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి మరోసారి వణికిపోతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక్కరోజే అత్యధికంగా 30వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

* వైరస్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు స్థానికంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

దేశ రాజధాని దిల్లీలోనూ వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన దిల్లీ ప్రభుత్వం, ఉన్నతాధికారులతో నేడు కీలక భేటీ ఏర్పాటు చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఎల్‌జీ, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశంలో కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

ఇప్పటికే దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4కోట్ల 50లక్షల డోసులను పంపిణీ చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీంతో మరికొంత కాలం పాటు మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని