Stalin: దిల్లీ తరహాలో మోడల్‌ స్కూళ్లు.. కేజ్రీవాల్‌ని ఆహ్వానించాం!

తమ రాష్ట్రంలో దిల్లీ తరహాలోనే మోడల్‌ పాఠశాలు నిర్మిస్తున్నామనీ.. వాటిని సందర్శించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని ఆహ్వానించినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ......

Published : 02 Apr 2022 01:59 IST

దిల్లీ: తమ రాష్ట్రంలో దిల్లీ తరహాలోనే మోడల్‌ పాఠశాలలు నిర్మిస్తున్నామనీ.. వాటిని సందర్శించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని ఆహ్వానించినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. నిన్న దిల్లీలో ప్రధానిని కలిసిన స్టాలిన్‌.. శుక్రవారం కూడా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కేజ్రీవాల్‌తో కలిసి దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించారు. ఆప్‌ సర్కార్‌ వచ్చాక దిల్లీ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయో అధికారులు స్టాలిన్‌కు వివరించారు. గత ఆరేడేళ్లలో దిల్లీ బడ్జెట్‌లో దాదాపు 25శాతం మేర విద్యా రంగానికే స్థిరంగా ఖర్చు చేసినట్టు తెలిపారు. 2014-15లో ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతిలో ఉత్తీర్ణత శాతం ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే తక్కువగా 88శాతం ఉండేదనీ.. కానీ 2019-20 నాటికి అది 98శాతానికి పెరిగిందన్నారు. ప్రయివేటు పాఠశాలల ఉత్తీర్ణత శాతం మాత్రం 92శాతంగానే ఉందని తెలిపారు.

ఆ రెండు రంగాలకే అధిక ప్రాధాన్యం: స్టాలిన్‌

అనంతరం స్టాలిన్‌ మాట్లాడుతూ.. దక్షిణాదిలోని తమిళనాడులో దిల్లీ స్కూళ్లను ప్రతిబింబించేలా మోడల్‌ పాఠశాలలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించారు. దిల్లీలో మోడల్‌ పాఠశాలలు ఎలా నడుస్తున్నాయో.. తమిళనాడులోనూ అలాగే చేస్తున్నట్టు చెప్పారు. ఆ పని పూర్తి కాగానే కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామన్నారు. తమిళనాడు ప్రజల తరఫున ఆహ్వానిస్తున్నా.. ఆయన తప్పకుండా రావాలి అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వ బడుల్లో ఈత కొలనులు.. ఇప్పుడు కంటెంట్‌పై దృష్టి!

ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్స్‌ని శిక్షణ కోసం విదేశాలకు పంపామనీ, ఉపాధ్యాయుల్ని ఐఐఎంకు పంపినట్టు కేజ్రీవాల్‌ స్టాలిన్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆంగ్ల భాష మెరుగుదల కోసం ఏం చేశారని స్టాలిన్‌ అడగ్గా.. ఉపాధ్యాయులు ఆంగ్ల భాషలో శిక్షణ కోసం బ్రిటిష్‌ కౌన్సిల్‌, అమెరికా ఎంబసీతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, దిల్లీలో కొత్త విద్యా బోర్డు, హ్యాపీనెస్‌ కరిక్యూలమ్‌, దేశభక్తి కరిక్యూలమ్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ తదితర అంశాలను స్టాలిన్‌కు వివరించారు. తొలుత కొన్నేళ్ల పాటు పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించామన్నారు. క్రీడా వసతులు, ఈత కొలనులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రెండో దఫా శిక్షణ కోసం ప్రిన్సిపల్స్‌, ఉపాధ్యాయులందరినీ పంపుతున్నామన్నారు. దీంతో వారంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు పిల్లలకు బోధించే కంటెంట్‌పై దృష్టిసారించినట్టు కేజ్రీవాల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని