IndiGo: టేకాఫ్‌ అయిన 3 నిమిషాలకే ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

IndiGo flight emergency landing: ఇంజిన్‌ వైఫల్యంతో పట్నాలో ఓ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే విమానాన్ని వెనక్కి మళ్లించారు.

Updated : 04 Aug 2023 11:53 IST

పట్నా: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే విమానంలో సాంకేతిక లోపం (Technical Snag) తలెత్తడంతో వెంటనే దాన్ని అత్యవసరంగా దించేశారు (emergency landing). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

బిహార్‌ రాజధాని పట్నా (Patna)లోని జయప్రకాశ్‌ నారాయణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం ఇండిగో 6ఈ 2433 విమానం దిల్లీ (Delhi)కి  బయల్దేరింది. అయితే, టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే విమానంలోని ఒక ఇంజిన్‌ పనిచేయడం లేదని పైలట్‌ గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఏటీసీకి అందజేయడంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు.

ఉదయం 9.11 గంటలకు విమానం పట్నా ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలన్నీ సజావుగానే సాగుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

గత నెల దిల్లీ నుంచి ప్యారిస్‌ బయల్దేరిన ఓ ఎయిరిండియా విమానం కూడా టేకాఫ్‌ అయిన గంటకే వెనక్కి వచ్చింది. విమానం బయల్దేరిన కాసేపటికి రన్‌వేపై టైరు శిథిలాలను గుర్తించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌కు సమాచారమిచ్చారు. టైర్‌ పేలి ఉంటుందన్న అనుమానంతో విమానాన్ని వెనక్కి మళ్లించి దిల్లీలో అత్యవసరంగా దించేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు