Make India No.1: ప్రపంచ నంబర్‌ 1గా ఎదగాలంటే.. వీటివల్లే సాధ్యం

ప్రపంచంలో భారత్‌ను మరోసారి నంబర్‌ 1గా తీర్చిదిద్దేందుకు దేశప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Updated : 17 Aug 2022 16:44 IST

మేక్‌ఇండియా నం.1 మిషన్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్‌

దిల్లీ: ప్రపంచంలో భారత్‌ను మరోసారి నంబర్‌ 1గా (Make India No.1) తీర్చిదిద్దేందుకు దేశ ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పేర్కొన్నారు. విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలతోపాటు మహిళలకు సమాన హక్కులు కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా దిల్లీలో ‘మేక్‌ ఇండియా నం.1’ మిషన్‌ను ప్రారంభించిన ఆయన.. తాము చేపట్టిన ఈ జాతీయస్థాయి కార్యక్రమంలో భాజపా, కాంగ్రెస్‌, ఇతర పార్టీలతోపాటు దేశప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

‘అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ మరోసారి నంబర్‌ 1 కావాలనే లక్ష్యాన్ని సాధించాలంటే.. ఉచిత విద్య, ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, యువతకు ఉపాధి, మహిళలకు సమాన హక్కులు, రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉంది’ అని మేక్‌ ఇండియా నం.1 మిషన్‌ ప్రారంభం సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఈ మిషన్‌లో చేరేలా ప్రజలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తానన్నారు.

‘ఇది రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం కాదు, ఇది జాతీయ మిషన్‌. భాజపాతోపాటు ఇతర పార్టీలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. తద్వారా ప్రపంచంలోనే నంబర్‌ 1గా మరోసారి భారత్‌ను నిలబెట్టవచ్చు. సింగపూర్‌ వంటి ఎన్నో దేశాలు భారత్ తర్వాత స్వాతంత్ర్యం పొందినప్పటికీ అవి మనకంటే ముందున్నాయి. ప్రపంచంలో అత్యంత తెలివితేటలు, కష్టపడే తత్వం కలిగిన భారతీయులుగా పేరుగాంచిన మనం ఇంకా ఎందుకు వెనుకబడే ఉన్నాం’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. అయితే, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ‘ఉచితాల’ విషయంలో భాజపాకు, ఆప్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సమయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మిషన్‌ను ప్రారంభించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని