Obesity: కరోనా వైరస్‌ ఊబకాయాన్ని పెంచేసిందా..?

కరోనా సమయంలో దేశంలో ఊబకాయం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఈ అంశంపై సంయుక్తంగా అధ్యయనం చేపట్టాలని.......

Published : 16 Apr 2022 02:04 IST

అధ్యయనం చేపట్టనున్న ఐసీఎమ్​ఆర్, ఎన్‌ఐఎన్‌

దిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కోట్లాది భారతీయులు ఇళ్లకే పరిమితమయ్యారు. నెలలపాటు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే దేశంలో ఊబకాయం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఈ అంశంపై సంయుక్తంగా అధ్యయనం చేపట్టాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్‌) నిర్ణయించుకున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. కరోనా మహమ్మారికి ముందు, తరువాత వయసుల వారీగా ఊబకాయుల సంఖ్య పెరుగుదలను ఈ సంస్థలు పర్యవేక్షించనున్నాయి. ఇందుకోసం దేశంలోని అనేక ప్రాంతాలకు చెందినవారి సమాచారాన్ని ఆరోగ్య సంస్థలు సేకరించనున్నాయి.

‘ఊబకాయంపై అధ్యయనం చేపట్టేందుకు చర్చలు సాగుతున్నాయి. ఇందుకు అనుమతి లభించిన తర్వాత అధ్యయనం ప్రారంభమవుతుంది. ఇదో సహకార అధ్యయనం. దీనిని పూర్తి చేసేందుకు ఇతర సంస్థలు కూడా భాగస్వామ్యులవుతున్నాయి’ అని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌లో పనిచేసే శాస్త్రవేత్త డాక్టర్ ఆవుల లక్ష్మయ్య వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆహార వినియోగంపై ఇప్పటికే పలు అధ్యయనాలు చేసినట్లు తెలిపారు.

బాల్య ఊబకాయంపై ముఖ్యంగా దృష్టిసారించనున్నట్లు లక్ష్మయ్య పేర్కొన్నారు. జంక్‌ఫుడ్‌ బాల్య ఊబకాయాన్ని పెంచేస్తోందన్నారు. ‘ఊబకాయంపై ఓ పరిశోధనను వెల్లడించాం. అధిక బరువుకు కారణమయ్యే జంక్‌ఫుడ్‌ను విశ్లేషించాం. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం కారణంగానే 53శాతం ఊబకాయం బారిన పడుతున్నట్లు తేలింది. ప్రాసెస్ చేసిన జంక్‌ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహార వినియోగం పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణంగా అధ్యయంలో తేలింది’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని