ఎంబీఏ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. హోంమంత్రి వ్యాఖ్యల్ని తప్పుబట్టిన సీఎం!

mysuru gang-rape: నేరస్థులను త్వరలోనే పట్టుకొనేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం స్పష్టంచేశారు.

Published : 26 Aug 2021 23:43 IST

దిల్లీ: మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై మంగళవారం రాత్రి జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై సీరియస్‌ అయ్యారు. నేరస్థులను త్వరలోనే పట్టుకొనేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపీ, తాను బెంగళూరు వెళ్లాక తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఆ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి ఎడారిలాంటి ఈ ప్రాంతానికి వచ్చి ఉండకూడదని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని బొమ్మై అన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించినట్టు చెప్పారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తనకు తెలియపరచాలని కూడా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన బాధితురాలితో పాటు ఆమె స్నేహితుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని