Farmers Protest: ‘దిల్లీ చలో’..రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌

Farmers Protest: ‘దిల్లీ చలో’ పేరుతో దేశ రాజధానిలో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు మార్చ్‌ మొదలుపెట్టారు. ఇంద్రప్రస్థ దిశగా ట్రాక్టర్లతో బయల్దేరారు.

Updated : 13 Feb 2024 15:25 IST

దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు (Farmera Protest) రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ మార్చ్‌ (Farmers March)ను అన్నదాతలు మంగళవారం ప్రారంభించారు. ఈ ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీ (Delhi)కి బయల్దేరారు. అటు సంగ్రూర్‌ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థ దిశగా కదిలింది.

ఈ సందర్భంగా కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ.. ‘‘మేం బారికేడ్లను బద్దలుకొట్టాలనుకోవడం లేదు. చర్చలతోనే మా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ, వారు (కేంద్రం) మాకు ఏ విధంగా సాయం చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలుపెట్టాం. రోడ్లను బ్లాక్‌ చేస్తామని మేం చెప్పలేదు. ప్రభుత్వమే అలా చేస్తోంది. పంజాబ్‌, హరియాణా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కన్పిస్తున్నాయి’’ అని అన్నారు.

బుల్డోజర్‌తో కూల్చడం పరిపాటైంది..

దిల్లీ సరిహద్దుల్లో అలర్ట్‌..

రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. పలు చోట్ల కాంక్రీట్‌ బ్లాక్స్‌, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. దిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్‌ సమీపంలో ఉన్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.

కిలోమీటరు దూరానికి గంట..

సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. గాజీపుర్‌, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. కిలోమీటరు దూరానికే గంటకు పైగా సమయం పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

రైతులను జైల్లో పెట్టడం సరికాదు: కేజ్రీవాల్‌

మరోవైపు, అన్నదాతల ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రైతులను నిర్బంధించేందుకు వీలుగా దిల్లీలోని బావనా ప్రాంతంలో తాత్కాలిక జైలుగా ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. రైతన్నలను జైల్లో పెట్టడం సరికాదన్నారు.

ఈ ఆందోళనపై కేంద్రం, రైతుల మధ్య సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు చేసిన డిమాండ్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రైతులు ఆందోళన ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని