PM Modi: జీ-20 సదస్సులో గాంధీజీ మిషన్‌ను అనుకరిద్దాం: మోదీ ట్వీట్లు

జీ-20 సదస్సు (G20 Summit)లో మహాత్మాగాంధీ మిషన్‌ను అనుకరిద్దామని ప్రధాని మోదీ అన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత, ప్రపంచ శాంతి కోసం జీ-20 దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.

Published : 08 Sep 2023 18:03 IST

దిల్లీ: భారత్‌ అధ్యక్షతన జరిగే జీ-20 సదస్సు (G20 Summit).. మానవ ప్రయోజనాలు, సమ్మిళిత అభివృద్ధికి కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. శని, ఆదివారాల్లో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనున్న వేళ.. ప్రధాని మోదీ తాజాగా దీనిపై స్పందించారు. భారత ఆతిథ్యాన్ని ప్రపంచ నేతలు ఆస్వాదిస్తారన్నారు.

‘‘దిల్లీ (Delhi)లోని ప్రఖ్యాత భారత మండపంలో 18వ జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్నందుకు యావత్‌ భారత్‌ ఆనందంగా ఉంది. భారత్‌ ఆతిథ్యంలో జరుగుతున్న తొలి జీ-20 సదస్సు (G20 Summit) ఇదే. ఈ రెండు రోజుల్లో ప్రపంచ నేతల చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నా. ఈ సదస్సు.. మానవ ప్రయోజనాలకు, సమ్మిళిత అభివృద్ధికి ఓ కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందని బలంగా విశ్వసిస్తున్నా’’ అని ప్రధాని మోదీ (PM Modi) రాసుకొచ్చారు.

భారత అల్లుణ్ని.. ఈ పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే: రిషి సునాక్‌

‘‘ఈ జీ-20 సదస్సులో భారత్‌ నినాదం వసుధైక కుటుంబం - ఒకే పుడమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిద్దాం. పేద దేశాల అభివృద్ధికి గళమెత్తుదాం. నిరుపేదలకు, అట్టడుగు వర్గాల వారికి సేవ చేయాలనే, చిట్టచివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందాలనే గాంధీజీ మిషన్‌ను అనుకరించడం చాలా ముఖ్యం.  లింగ సమానత్వం, మహిళా సాధికారత, ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తాం’’ అని మోదీ తెలిపారు.

ఇక, సదస్సులో భాగంగా పలు దేశాధినేతలు, ప్రతినిధులతో తాను ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. భారత ఆతిథ్యాన్ని ప్రపంచ నేతలు గొప్పగా ఆస్వాదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 9న రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారని, ఆ తర్వాత సెప్టెంబరు 10న రాజ్‌ఘాట్‌లోని మహాత్ముడి స్మారకం వద్ద ప్రపంచ నేతలు నివాళులర్పిస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని