G20 Summit: భారత అల్లుణ్ని.. ఈ పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే: రిషి సునాక్‌

G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు భారత్‌కు తరలి వస్తున్నారు. భారత్‌కు బయలుదేరేముందు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 08 Sep 2023 16:25 IST

లండన్‌: జీ20 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ భారత్‌కు చేరుకున్నారు. తన సతీమణి అక్షతామూర్తితో కలిసి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ సహా ఇతర సీనియర్‌ దౌత్యవేత్తలు ఆయనకు స్వాగతం పలికారు. వారి గౌరవార్థం ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను వారు ప్రశంసించారు.

అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్‌ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్‌ (Rishi Sunak) వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళుతున్నానని చెప్పారు.

ఐటీసీ మౌర్యలో బైడెన్‌..శాంగ్రీలాలో బస చేయనున్న సునాక్‌

ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సునాక్‌ విమర్శలు గుప్పించారు. జీ20 (G20 Summit) వేదికపై పుతిన్‌ మరోసారి ముఖం చాటేశారని వ్యాఖ్యానించారు. పుతిన్‌ స్వయంగా తనకు తానే దౌత్య బహిష్కరణ రూపశిల్పిగా మలుచుకున్నారని పేర్కొన్నారు. అధ్యక్ష భవనంలో ఉంటూ విమర్శలు పట్టించుకోకుండా వాస్తవికతకు దూరంగా ఉంటున్నారని అన్నారు. అదే సమయంలో మిగిలిన జీ20 (G20 Summit) సభ్యదేశాలు ఆయన పతనానికి కలిసి పని చేస్తామని చాటిచెబుతున్నాయన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను.. మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడిగా సునాక్‌ (Rishi Sunak) అధికార ప్రతినిధి అభివర్ణించారు. దీన్ని తిప్పికొట్టడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యానించారు. పుతిన్ ఆక్రమణలను అంతం చేయడానికి భారత్‌ తన పరపతిని ఉపయోగించాలని మోదీతో సహా అందరినీ కోరతామని పేర్కొన్నారు.

మరోవైపు సదస్సులో పాల్గొనే నిమిత్తం ఇప్పటికే జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, అర్జెంటినా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఆఫ్రికన్‌ యూనియన్‌ ఛైర్‌పర్సన్‌ అజాలీ అసౌమని, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలినా జార్జివా, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ దిల్లీకి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు