BSF: భారత్‌-పాక్‌ సరిహద్దును ముంచేసిన వరద.. ప్రాణాలకు తెగించి BSF గస్తీ

పంజాబ్‌లో భారీ వరద కారణంగా భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దులోని (International Border) బీఎస్‌ఎఫ్‌ ఔట్‌పోస్టులు, ఫెన్సింగ్‌ నీట మునిగాయి.

Published : 20 Aug 2023 19:56 IST

దిల్లీ: ఉత్తరాదిన కురుస్తోన్న భారీ వర్షాలతో సట్లెజ్‌ నదికి వరద తాకిడి పెరిగింది. ముఖ్యంగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో వందల గ్రామాలకు వరద ముప్పు (Punjab Floods) ఏర్పడింది. ఈ ప్రభావం ఆ జిల్లాలో ఉన్న భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దుపైనా (International Border) పడింది. భారీ వరద కారణంగా బీఎస్‌ఎఫ్‌ ఔట్‌పోస్టులతో పాటు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న ఫెన్సింగ్‌ కూడా నీట మునిగింది. దీంతో భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి గస్తీ కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) వెల్లడించింది.

‘అంతర్జాతీయ సరిహద్దున ఉన్న బీఎస్‌ఎఫ్‌ పోస్టులు మొత్తం ఐదారడుగుల నీటిలో (Sutlej Floods) మునిగిపోయాయి. ఇలాంటి సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మన జవాన్లు 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నారు. వ్యక్తిగత భద్రతను పక్కనపెట్టి ఆ ప్రాంతంలో కాపలా కాస్తున్నారు. మోటార్‌బోట్ల సాయంతో నిఘా కొనసాగిస్తున్నారు’ అని ఓ బీఎస్‌ఎఫ్‌ అధికారి పేర్కొన్నారు.

పాంగాంగ్‌ సరస్సుకు రాహుల్‌ బైక్‌ యాత్ర

సట్లెజ్‌ నది పొంగిపొర్లుతుండటంతో ఫిరోజ్‌పుర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అనేక గ్రామాలు నీటి మునిగిపోతున్నాయి. పౌంగ్‌, భాక్రా ఆనకట్టల నుంచి వస్తోన్న అదనపు నీటితో పరీవాహక జిల్లాలైన గురుదాస్‌పుర్‌, హోషియార్‌పుర్‌, తరన్‌ తారన్‌, కపుర్తలా, రూప్‌నగర్‌, ఫిరోజ్‌పుర్‌ల్లోని 150కిపైగా గ్రామాలు భారీ వరదను ఎదుర్కొంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో కలిసి బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది రిలీఫ్‌ ఆపరేషన్‌లలో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. కేవలం ఫిరోజ్‌పుర్‌లోనే 2500 మంది గ్రామస్థులను తరలించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని