Afghanistan: ‘మేడపై శబ్దం ఏంటా అని వెళితే.. ఆ ఇద్దరూ వీరేనని తెలిసింది!’

ఇదీ కాబుల్‌లోని 49 ఏళ్ల వాలి సలేక్‌కు సోమవారం ఎదురైన పరిస్థితి.

Updated : 11 Nov 2022 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాలిబన్లు కాబుల్‌ను వశపరుచుకున్నారన్న వార్త తెలియడంతో ఆ నగరంలోని చాలా ఇళ్ల తలుపులు తెరుచుకోలేదు. ముఖ్యంగా మహిళలు ఉన్న కుటుంబాలైతే బయటకెళ్లే సాహసం చేయలేదు. అలాంటి ఓ కుటుంబమే సలేక్‌ది. అది సోమవారం. ఇంట్లో వారందరూ అవకాశం చిక్కితే దేశం ఎలా దాటాలో అన్న చర్చల్లో తలమునకలై ఉన్నారు. ఇంతలో మేడపై పేద్ద శబ్దం. కొంపదీసి.. బాంబా? ఒకవేళ బాంబే అయితే ఈ పాటికే మనమంతా తునాతునకలైపోయేవాళ్లం కదా అని అందులో ఒకరన్నారు. మరేమై ఉంటుంది? ఒక్క క్షణం నిశ్శబ్దం. ట్రక్కు టైర్‌ ఏమైనా పేలిందా? అయినా మేడమీద నుంచి శబ్దం ఎలా వస్తుంది? ఇంట్లో వాళ్లెవరూ కొంతసేపటి వరకు పైకెళ్లే సాహసం చేయలేదు. కాసేపటికి ఇంటి పెద్ద ఓ రెండడుగులు ముందుకు.. ఓ అడుగు వెనక్కు వేసుకుంటూ ముందుకు సాగాడు. తన వెంటే అతడి భార్య కూడా నడిచింది. అనుకోనిది ఏదైనా జరిగినా భర్తతో పాటే తానూ అనుకుంటూ! మేడపైకి చేరుకున్న కాసేపటికే అక్కడి దృశ్యాలు చూసి ఆమె మూర్ఛపోయింది. నెత్తుటి వర్షమేమైనా కురిసిందా అన్నట్లు పడి ఉన్న రక్తపు మరకలు.. విడి శరీర భాగాలు దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాలను చూసిన సలేక్‌కు కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఒక్కో అడుగుకు ఒక్కో ఛిద్రమైన భాగం కనిపిస్తుంటే ఒళ్లు కంపించింది. ఇంకెవరు ఈ దృశ్యాలు చూసినా వాళ్లకీ ఇదే పరిస్థితి అనుకుంటూ వెంటనే ఓ వస్త్రాన్ని తీసి కప్పాడు. ఆ భాగాలను మత పెద్దలకు అప్పగించాడు. వాటిని వారు ఖననం చేసేందుకు తీసుకెళ్లారు. ఇంతలో ‘ఇందాకే టీవీలో చూశా.. ఓ ఇద్దరు విమానం నుంచి కింద పడిపోయారట’ చెప్పుకొచ్చాడు పక్కింటాయన. అప్పుడు సలేక్‌కు తెలిసింది తన ఇంటి మేడపై నుంచి కింద పడింది వారిద్దరేనని!!

-ఇదీ కాబుల్‌లోని 49 ఏళ్ల వాలి సలేక్‌కు సోమవారం ఎదురైన పరిస్థితి. అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితిని టీవీల్లో చూసేవారికి ఈ సన్నివేశ వర్ణన కూడా తక్కువగానే అనిపించొచ్చు.

కాబుల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సలేక్‌ తాజాగా భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల ఛానెల్‌తో మాట్లాడుతూ తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. మృతదేహాల వద్ద దొరికిన పుట్టిన తేదీ ధ్రువపత్రాల బట్టీ ఒకరు ఫిదా మహ్మద్‌, ఇంకొకరు సఫీఉల్లాహ్‌ హోతక్‌ అని గుర్తించినట్లు చెప్పారు. ఇద్దరికీ 30 ఏళ్లకు మించి ఉండవని తెలిపారు. ఇక కాబూల్‌లోని పరిస్థితిని వివరిస్తూ ‘‘కాబూల్‌ వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్కరు కూడా కనిపించడం లేదు. తర్వాతి గంట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక్కడ పరిస్థితి అంతా భయానకంగా ఉంది. ఒకవేళ నాకే అవకాశం వస్తే అఫ్గాన్‌ను విడిచి వెళ్లిపోతా’’ అంటూ అఫ్గాన్‌ పరిస్థితిని కళ్లకు కట్టారు సలేక్‌. కాబుల్‌ విమానాశ్రయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది సలేక్‌ నివాసం.

కాబుల్‌ను తాలిబన్లు వశపరుచుకున్నాక వందలాది మంది ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తిన సంగతి తెలిసిందే. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానమొకటి రన్‌వేపై వెళ్తుండగా అమాయకులైన కొందరు పౌరులు చక్రాల వద్ద కూర్చుని ప్రయాణించే సాహసం చేశారు. కాసేపటికే ఇద్దరు, ముగ్గురు కిందపడిపోవడం వీడియోల్లో కనిపించింది. విమానం కతర్‌ చేరుకున్న తర్వాత కూడా తమకు కొన్ని మానవ అవశేషాలు కనిపించాయని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ దళాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని