G20 Summit: జీ20 సదస్సు ముగిసింది.. ఫౌంటెన్లలో నుంచి నాజిల్స్‌ మాయమయ్యాయి!

జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా దిల్లీలోని (Delhi) పలు కూడళ్ల వద్ద ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. వాటిలో నుంచి విలువైన నాజిల్స్‌ మాయమైనట్లు తెలిసింది.

Published : 10 Oct 2023 23:07 IST

దిల్లీ: ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)ను నిర్వహించింది. దిల్లీ (Delhi) వేదికగా జరిగిన సమావేశాల కోసం ఇండియా గేట్, భారత మండపం సమీపంలో ఆకర్షణీయమైన ఫౌంటెన్‌లను ఏర్పాటు చేసింది. అయితే, వాటిలో నుంచి సుమారు రూ.10 లక్షల కంటే విలువైన నాజిల్స్‌ చోరీకి గురయ్యాయని అధికారులు మంగళవారం తెలిపారు. ఫౌంటెన్‌ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో తయారైన ఒక్కో నాజిల్‌ విలువ రూ.4 వేలు ఉంటుందట. 

రాజీనామా ఆమోదించాలంటూ పాదయాత్ర.. మహిళా డిప్యూటీ కలెక్టర్‌ అరెస్టు!

జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలోని పలు చోట్ల ఫౌంటెన్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ‘భారత మండపం వద్ద 24 నాజిల్స్‌, ఇండియా గేట్‌ వద్ద 12 నాజిల్స్‌ చోరీకి గురయ్యాయి. జీ20 సదస్సు ముగిసిన తరువాత ఈ దొంగతనం జరిగింది’ అని ఓ అధికారి వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా అని అడగ్గా.. భారత మండపం 6, 7 గేట్ల వద్ద మాత్రమే ఏజెన్సీ కెమెరాలు అమర్చిందని బదులిచ్చారు. దిల్లీ పోలీసులు సైతం కెమెరాలు ఏర్పాటు చేశారని, అయితే అవి పనిచేస్తున్నాయో లేదో తెలియదన్నారు. నాజిల్స్‌ ఖరీదైనవి కావడంతో వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇండియా గేట్‌ వద్ద కన్పించకుండా పోయిన నాజిల్స్‌ స్థానంలో ప్లాస్టిక్‌ వాటిని అమర్చుతామని, భారత మండపం వద్ద మాత్రం స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని