Ola Electric: ఓలా సీఈఓ మనసు దోచుకున్న నాలుగేళ్ల బుడతడు

ఆగ్రాకు చెందిన ఖుష్ణవ్‌ ఖిర్‌వార్‌ అనే బాలుడు తన డ్యాన్స్‌తో మెప్పించి.. ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ మనసు గెలుచుకున్నాడు. తమిళనాడులోని ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని సందర్శించేందుకు ఆహ్వానం అందుకున్నాడు.

Updated : 19 Jan 2024 17:29 IST

చెన్నై: అద్భుతమైన ప్రతిభతో కొందరు చిన్నారులు అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఆ కోవకు చెందినవాడే ఆగ్రాకు చెందిన నాలుగేళ్ల బాలుడు ఖుష్ణవ్‌ ఖిర్‌వార్‌ (Khushnav Khirwar). తన డ్యాన్స్‌, పాటలతో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) మనసును గెలుచుకున్నాడు. అంతేకాక తమిళనాడులో 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన    ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని (Futurefactory) సందర్శించేందుకు ఆహ్వానం అందుకున్నాడు. నృత్యం, గానంలో తనదైన శైలిలో ప్రదర్శనలిస్తున్న ఖుష్ణవ్‌.. ఆ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశాడు. భవిష్‌ అగర్వాల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘‘అంకుల్‌.. నేను రాక్‌స్టార్‌ ఖుష్ణవ్‌. మీ ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని సందర్శించేందుకు అవకాశం ఇవ్వండి’’ అని అభ్యర్థించాడు.

దీనిపై భవిష్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. ‘‘ నీ డ్యాన్స్‌ చాలా బాగుంది. ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని సందర్శించాలన్న నీ ఉత్సుకతకు చాలా సంతోషం. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు. అమ్మానాన్నను తీసుకొని రా.. వాళ్లూ సంతోషపడతారు’’ అని బదులిచ్చారు. ఓలా ఎలక్ట్రిక్‌కు తమిళనాడులోని కృష్ణగిరిలో ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం. ఈ యూనిట్‌లో ఉద్యోగులంతా మహిళలే కావడం గమనార్హం. దాదాపు 10 వేల మంది ఉద్యోగినులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు