Corona: జూన్‌ నుంచి మరణాల్లో తగ్గుదల

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం కేసులు, మరణాల సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో జూన్‌ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 19 May 2021 14:11 IST

అంచనా వేస్తున్న నిపుణులు

దిల్లీ: భారత్‌లో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో పాటు, టీకా కొరతను అధిగమిస్తామని వారు వెల్లడించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందేలా చూడటం వల్ల  కరోనా మరణాల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని తెలిపారు.

పెరగనున్న టీకా సరఫరా..

భారత్‌లో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రోజుకు 25లక్షలకు పైగా డోసులు అందించాలని ఇప్పటికే టీకా తయారీదారులకు సూచించారు. జూన్‌ నుంచి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రోజు రోజుకూ టీకా తీసుకొనే వారి సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోందని నిపుణులు తెలిపారు. వీలైనంత త్వరలో 45ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందించడం పూర్తి చేసి 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌, బిహార్‌, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హరియాణాల్లో ఇప్పటికే 18ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తుండగా.. మిగతా రాష్ట్రాల్లో ప్రారంభించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని