Electoral Bonds: ఎన్నికల బాండ్లపై ఏడుపెందుకు.. లెక్కలు చూడండి: విపక్షాలకు అమిత్ షా కౌంటర్‌

Electoral Bonds: ఎన్నికల బాండ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి అమిత్ షా గట్టిగా తిప్పికొట్టారు. ఈ పథకంతో విపక్ష ఎంపీలకే రూ.14వేల కోట్లు దక్కాయని అన్నారు.

Updated : 16 Mar 2024 10:34 IST

దిల్లీ: రాజకీయాల్లో నల్లధన ప్రభావాన్ని అరికట్టేందుకే ఎన్నికల బాండ్ల (Electoral Bonds) పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా గౌరవిస్తామన్నారు. అయితే, దీన్ని రద్దు చేయడానికి బదులుగా మెరుగుపర్చే అవకాశమిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియాటుడే’ నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడుతూ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల బాండ్ల పథకం ఓ కుంభకోణం అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు హోంమంత్రి గట్టిగా బదులిచ్చారు. ‘‘ఈ పథకంలో మా పార్టీ లబ్ధి పొందిందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం రూ.20వేల కోట్ల ఎన్నికల బాండ్లలో భాజపాకు దాదాపు రూ.6వేల కోట్లు వచ్చాయి. మరి మిగతా నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి? టీఎంసీకి రూ.1600కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1400కోట్లు, ఇలా మిగతా పార్టీలకు కూడా అందాయి. పార్లమెంట్‌లో 303 మంది ఎంపీలున్న మా పార్టీకి రూ.6వేల కోట్లు వస్తే.. 242 మంది ఎంపీలున్న విపక్షాలకు రూ.14వేల కోట్లు దక్కాయి. మరి ఈ ఏడుపు ఎందుకు? బాండ్లపై ఒకసారి లెక్కలన్నీ తేలితే.. ప్రతిపక్షాలు ప్రజలకు ముఖం చూపించలేవు’’ అని అమిత్ షా మండిపడ్డారు.

ఎన్నికల బాండ్లు అతిపెద్ద కుంభకోణం.. విపక్షాల ధ్వజం

ఎన్నికల బాండ్ల రద్దుతో రాజకీయాల్లోకి మళ్లీ నల్లధన ప్రవాహం మొదలయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ బాండ్లతో నగదు నేరుగా దాతల ఖాతాల్లో నుంచి పార్టీల బ్యాంకు ఖాతాలకు చేరింది. ఇందులో ఎలాంటి రహస్య సమాచారం లేదు. కాంగ్రెస్‌ తమ విరాళాలను నగదు రూపంలో తీసుకోవాలని అనుకుంటోంది. ఎందుకంటే.. ఎవరైనా వారికి రూ.1100 ఇస్తే అందులో నుంచి రూ.100 పార్టీకి జమ చేసి మిగతా రూ.1000ని నాయకులు జేబుల్లో వేసుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆ పార్టీలో ఇదే జరుగుతోంది’’ అని షా దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘దేశంలో పలుమార్లు వివిధ ఎన్నికలు జరగడం వల్ల పోలింగ్‌పై భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక, కోడ్‌ అమలుతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. వీటికి ఒకే దేశం-ఒకే ఎన్నికనే సరైన పరిష్కారం. ఇది అమల్లోకి వస్తే.. అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది’’ అని కేంద్రమంత్రి వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని