G20 Summit: అణు బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు..: ఉక్రెయిన్‌ యుద్ధంపై న్యూదిల్లీ డిక్లరేషన్‌

దిల్లీ డిక్లరేషన్‌లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఎట్టకేలకు ఏకాభిప్రాయం వచ్చింది. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలను మాత్రమే ఇందులో చేర్చారు. ఆహార కొరతను ఎదుర్కోవడం, అణ్వాయుధ వినియోగాన్ని వ్యతిరేకించడం వంటివి ఉన్నాయి. 

Updated : 09 Sep 2023 17:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో తీర్మానం రూపొందించడంలో ప్రధాన అడ్డంకిగా నిలిచిన అంశం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం. తాజాగా భారత్‌ దౌత్య బృందం ఈ అడ్డంకిని అధిగమించి డిక్లరేషన్‌కు మార్గం సుగమం చేసింది. అన్ని దేశాలు ఆమోదించే అంశాలను ప్రస్తావిస్తూ డిక్లరేషన్‌ను ఓకే చేయించారు. దాదాపు 37 పేజీలతో ఈ రూపొందించిన ఈ తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నాలుగు సార్లు ప్రస్తావించారు. ముఖ్యంగా అణు బెదిరింపులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్న అంశంపై అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

యుద్ధంపై డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలు..

* ఐరాస ఛార్టర్‌కు అనుగుణంగా ఏదైనా ప్రాదేశిక సమగ్ర, సార్వభౌమత్వానికి, రాజకీయ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రాదేశిక దురాక్రమణలకు దూరంగా ఉండాలని పేర్కొంది. అణ్వాయుధాలను చూపి బెదిరించడాన్ని ఏ మాత్రం ఆమోదించమని వెల్లడించింది.

* ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ప్రజలపై అదనంగా వచ్చి పడిన ఆహార,ఇంధన సంక్షోభాలు, పంపిణీ వ్యవస్థల ఛిన్నాభిన్నం, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం వంటివి ఆయా దేశాల పాలనను కష్టతరం చేస్తున్నాయని తీర్మానం అభిప్రాయపడింది. 

జీ20 విస్తరణ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సభ్యత్వం ప్రకటించిన మోదీ

* రష్యన్‌ ఫెడరేషన్‌, ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం, ఆహార పదార్థాలు, ఎరువులు, ఇతర ముడి పదార్థాలను ఎటువంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలని పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికాలోని పేద దేశాల అవసరాలు తీర్చుకోవడానికి ఇది అవసరమని తెలిపింది. 

* సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు,  దానికి తగిన యత్నాలు, దౌత్యం, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్‌ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం కారణంగా పడుతున్న దుష్పరిణామాలను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఉపయోగపడే అన్ని సంబంధిత నిర్మాణాత్మక చర్యలను స్వాగతిస్తామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని