G20 Summit : జీ-20 భద్రతా విధులు భేష్‌.. పోలీసులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు!

దిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. వివిధ దేశాధినేతలు పాల్గొన్న జీ20 సదస్సులో (G20 Summit) పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా విధులు నిర్వహించారని గుర్తించిన ఆయన ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

Published : 13 Sep 2023 15:42 IST

దిల్లీ : దిల్లీలో గత వారం భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ప్రతి ప్రభుత్వ విభాగాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మంగళవారం సుష్మా స్వరాజ్‌ భవన్‌లోని జీ20 సెక్రటేరియట్‌ (G20 secretariat)లో ప్రధాని ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు విదేశాంగమంత్రి ఎస్‌ జై శంకర్‌ ( S Jaishankar) కూడా పాల్గొన్నారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులను పలకరించారు. సదస్సును విజయవంతం చేసేందుకు శ్రమించిన అధికారులకు ఆయన కృజ్ఞతలు తెలిపారు. ఈ వారంలోనే ప్రధాని జీ20 భద్రతా విధుల్లో పాల్గొన్న దిల్లీ పోలీసులకు విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 

కేరళలో ‘బంగ్లాదేశ్‌ వేరియంట్‌’ కలవరం.. ఆ గ్రామాల్లో స్కూళ్లు, బ్యాంకుల మూసివేత..

ఈ మేరకు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోడా ప్రతి జిల్లా నుంచి పోలీసుల వివరాల సేకరిస్తున్నారు. కానిస్టేబుల్ మొదలుకొని ఇన్‌స్పెక్టర్‌ వరకు ఆ జాబితాలో ఉన్నారు. మొత్తం 450 మంది పోలీసులతో జాబితా సిద్ధం చేస్తున్నారు. వారందరినీ జీ20 సదస్సు నిర్వహించిన ‘భారత మండపం’లో ప్రధాని నరేంద్రమోదీ కలుసుకోనున్నారు. సీపీ సంజయ్ ఇది వరకే పోలీసులకు ప్రత్యేక ప్రశంస డిస్క్‌, అభినందన పత్రం అందజేశారు. కాగా.. దేశానికి ఖ్యాతి తెచ్చే కార్యకలాపాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని ప్రధాని గుర్తిస్తున్నారు. మేలో నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముందు.. ఆ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను సత్కరించారు. 

జీ-20 సదస్సుకు ముందు, సదస్సు జరుగుతున్న సమయంలో దిల్లీ పోలీసులు సవాళ్లతో కూడిన భద్రతా విధులు నిర్వర్తించారు. దేశాధినేతలకు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తూ.. గోప్యత పాటించడానికి ప్రత్యేక సంకేత భాషను వినియోగించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విడిది చేసిన ఐటీసీ మౌర్యాకు అధికారులు పెట్టిన కోడ్‌నేమ్‌ ‘పాండోరా’. ఇక యూకే ప్రధాని రిషి సునాక్‌ బస చేసిన షంగ్రి-లా హోటల్‌ను ‘సమర’, నైజీరియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, మారిషస్‌ నేతలు, ప్రపంచ బ్యాంక్‌ అధికారులు విడిది చేసిన మెరిడియన్‌ను ‘మహాబోధి’గా.. యూఏఈ యువరాజు ఉన్న తాజ్‌ మాన్‌ సింగ్‌ను పారామౌంట్‌గా పిలుచుకొన్నారు. దీంతోపాటు ది లలిత్‌, ది గ్రాండ్‌ వంటి ఇతర హోటళ్లకు కూడా ఇలా కోడ్‌ వర్డ్స్‌ పెట్టుకొన్నారు. ప్రపంచ నేతలు సందర్శించిన రాజ్‌ఘాట్‌ను రుద్‌పుర్‌గా వ్యవహరించారు. జీ20 ప్రధాన వేదికైన ప్రగతి మైదాన్‌ను ‘నికేతన్‌’ అని పిలిచారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని