‘బతికుంటే వారిని కలుస్తానని చెప్పండి’

దేశ స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మహాత్ముడు.. ఆ స్వేచ్ఛావాయువులను పీల్చకుండానే వెళ్లిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన కేవలం 5 నెలల 15 రోజులకే శాశ్వతంగా ఈ లోకాన్ని వీడారు. 1948 జనవరి 30న

Updated : 30 Jan 2020 17:00 IST

చనిపోవడానికి ముందు మహాత్ముడు చెప్పిన మాటలు

దేశ స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మహాత్ముడు.. ఆ స్వేచ్ఛావాయువులను పీల్చకుండానే వెళ్లిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన కేవలం 5 నెలల 15 రోజులకే శాశ్వతంగా ఈ లోకాన్ని వీడారు. 1948 జనవరి 30న సాయంత్రం 5.17 గంటల సమయంలో గాడ్సే చేతుల్లో బాపూజీ ప్రాణాలు కోల్పోయారు. అయితే గాడ్సే కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు తనను కలవడానికి వచ్చిన వారిని ఉద్దేశించి గాంధీ ఇలా అన్నారు.. ‘బతికుంటే వారితో మాట్లాడతానని చెప్పండి’ అని. చివరిరోజుల్లో బాపూజీతో పాటు ఉన్న మను గాంధీ.. మహాత్ముడి ఆఖరి ఘడియల గురించి అనేక ఆసక్తికర విషయాలను తన పుస్తకం ‘లాస్ట్‌ గ్లింప్సెస్‌ ఆఫ్‌ బాపూ’లో పంచుకున్నారు. 

అలా చనిపోతే.. నకిలీ మహాత్ముడినే!

చనిపోవడానికి ముందు రోజు రాత్రి బాపూ చాలా అలసటగా ఉన్నారట. అయినప్పటికీ కాంగ్రెస్‌ రాజ్యాంగ ముసాయిదాను పూర్తి చేశారని మను పేర్కొన్నారు. అంతకు కొన్ని రోజులు ఆయన నిరాహార దీక్ష చేయడంతో గాంధీ ఆరోగ్యం క్షీణించింది. అలసట కారణంగా ఆయన తన రోజువారీ వ్యాయామం విషయాన్ని కూడా మర్చిపోయారట. మను గుర్తుచేయడంతో వ్యాయామం పూర్తి చేసిన గాంధీజీ.. తనకు కళ్లు తిరుగుతున్నట్లుగా అన్పిస్తుంది అన్నారు. దగ్గు కూడా ఎక్కువగా రావడంతో మను ఆయనకు పెన్సిలిన్‌ ఇచ్చారు. అయితే పెన్సిలిన్‌ తీసుకునేందుకు బాపూజీ నిరాకరించారు. 

‘‘వ్యాధులు, అనారోగ్యం కారణంగా నేను చనిపోతే ‘ఈ మహాత్ముడు నకిలీ వ్యక్తి’ అని నువ్వు ప్రపంచానికి అరిచి చెప్పాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. అలా కాకుండా బాంబు పేలుడులోనే లేదా ఎవరైనా నా ఛాతీ మీద బుల్లెట్‌తో కాల్చినప్పుడు నేను ‘రామ్‌’ అంటూ చనిపోతే అప్పుడు మాత్రమే నేను నిజమైన మహాత్ముడిని అని చెప్పాలి. అప్పుడే భారత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది’ అని గాంధీ మనుతో చెప్పినట్లు ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. 

అలాంటి వారికి జీవించే హక్కు లేదు..

మహాత్ముడిపై అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. విష ప్రయోగానికి కూడా యత్నించారు. గాంధీ హత్య జరగడానికి 10 రోజుల ముందే ఆయనను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగింది. ఆ ఘటన తర్వాత దిల్లీ పోలీసులు ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు గాంధీ నిరాకరించారట. ‘స్వేచ్ఛకు భద్రత కావాలని కోరుకునేవాడికి జీవించే హక్కు లేదు’ అని ఆ సందర్భంలో బాపూజీ అన్నారు. అయితే భద్రతను నిరాకరించడం వల్లే గాంధీని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. అలా గాడ్సే తుపాకీతో బాపూజీ వద్దకు రాగలిగాడు. 

రేపటి గురించి ఎవరికి తెలుసు..

నిజానికి 1948 ఫిబ్రవరి 2న గాంధీని మహారాష్ట్రలోని వార్దాలో ఉన్న సేవాగ్రామ్‌ ఆశ్రమాన్ని సందర్శించాల్సి ఉంది. ఆ పర్యటనకు సంబంధించి గాంధీ లేఖ కూడా రాశారు. అయితే దాన్ని పోస్ట్‌ చేయలేదు. ఈ విషయాన్ని మను ఆయన దగ్గర ప్రస్తావిస్తూ.. ఫిబ్రవరి 2 పర్యటనను ఖరారు చేయాలా అని అడిగారు. అందుకు గాంధీ బదులిస్తూ.. ‘రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..? తర్వాత చూద్దాం లే’ అన్నారని మను తన పుస్తకంలో రాసుకొచ్చారు. 

చనిపోడానికి కొద్ది క్షణాల ముందు..

1948 జవనరి 30 సాయంత్రం 5 గంటలకు గాంధీ బిర్లా మందిరంలో ప్రార్థనా సమావేశానికి వెళ్లాలి. బాపూజీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఎక్కడికైనా సమయానికి వచ్చేవారు. అయితే ఆ రోజు సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ తనను కలవడానికి రావడంతో గాంధీజీ సమయం చూసుకోకుండా ఆయనతో మాట్లాడుతూ ఉండిపోయారు. ఆలస్యమవడంతో 5.10 గంటలకు మను కల్పించుకుని ప్రార్థన గురించి గుర్తుచేశారు. అప్పుడు ఆయన బిర్లా మందిరానికి బయల్దేరారు. అయితే అప్పటికే గాంధీజీని కలవడానికి కథియావార్‌ నుంచి ఇద్దరు నేతలు రావడంతో వారి గురించి మను ఆయనకు చెప్పారు. అప్పుడు బాపూజీ.. ‘నేను బతికుంటే ప్రార్థన తర్వాత వారితో మాట్లాడతానని చెప్పండి’ అని మనుతో అన్నారట. 

సాయంత్రం 5.17 గంటలకు గాంధీ.. మను, అభాలతో కలిసి బిర్లా మందిరానికి వస్తుండగా నాథూరాం గాడ్సే గుంపును తోసుకుంటూ వచ్చి కాల్పులు జరిపాడు. ఒకదాని తర్వాత ఒకటి మూడు గుళ్లు పేల్చాడు. ‘హే రామ్‌’ అనుకుంటూ బాపూజీ నేలకొరిగారు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు