దిల్లీ అల్లర్లపై వివరణ ఇవ్వనున్న అమిత్‌షా

ఇటీవల దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక అల్లర్ల అంశం పార్లమెంట్‌లో చర్చకు రానుంది. దీనిపై మార్చి 11న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇవ్వనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. దిల్లీ అల్లర్ల అంశంపై చర్చచేపట్టాలని..

Published : 07 Mar 2020 00:21 IST

దిల్లీ: ఇటీవల దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింసాత్మక అల్లర్ల అంశం పార్లమెంట్‌లో చర్చకు రానుంది. దీనిపై మార్చి 11న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. దిల్లీ అల్లర్ల అంశంపై చర్చచేపట్టాలని పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే హోలీ ముగిసేవరకూ చర్చ చేపట్టడం సరికాదని స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. కానీ, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో దీనిపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని లోక్‌సభ నిర్ణయించింది. అయితే అంతకు ముందు స్పీకర్‌ ప్రకటించిన విధంగా మార్చి 11నే చర్చ చేపట్టనున్నారు.

‘‘సభకు అంతరాయం కలగకుండా ప్రతిపక్ష సభ్యులు చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. దిల్లీలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల చర్చ పెట్టేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ అంశంపై నాలుగు రోజుల పాటు చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఈ నెల 10న హోలీ పండగ తర్వాత 11న దిల్లీ అల్లర్లపై చర్చ జరుపుతామని స్పీకర్‌ ఓం బిర్లా రెండ్రోజుల క్రితమే ప్రకటించారు. అయితే అదే రోజున చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హౌస్‌లో పేపర్లను చింపి స్పీకర్‌ స్థానం వైపునకు ఉద్దేశపూర్వకంగా వేశారన్న కారణంగా వీరిని సస్పెండ్‌ చేసినట్టు స్పీకర్‌ ప్రకటించారు. హోలీ తర్వాత వరకు చర్చ చేపట్టబోమని ప్రభుత్వం చెబుతోందని, అల్లర్లలో తమ బంధువులను, స్నేహితులను కోల్పోయిన వారు సంతోషంగా హోలీ పండగ చేసుకోగలరా? అని సస్పెన్షన్‌కు గురైన ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ ప్రశ్నించారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారి కుటుంబం పరిస్థితి ఏంటని నిలదీశారు.

ఇటీవల ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందల మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే.పలు గృహసముదాయాలు, దుకాణాలు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని