Published : 17 Mar 2020 01:49 IST

ఆ ప్రయాణికులపై కేంద్రం కఠిన ఆంక్షలు

ముంబయి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల పాటు నిర్భంధ చికిత్స తప్పనిసరి చేసింది. విమాన, నౌకా ప్రయాణికులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది. ఈనెల 18 నుంచి నిబంధనలు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.  కరోనా నియంత్రణ చర్యలపై ఈ రోజు పలువురు కేంద్ర మంత్రుల బృందం సమీక్ష నిర్వహించిన అనంతరం అధికారులు ఈ విషయాలు వెల్లడించారు.

యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, టర్కీ, ఇంగ్లాండ్‌ నుంచి  భారతదేశానికి వచ్చే వారిపై మార్చి 18 నుంచి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ దేశాల నుంచి ఏ ఒక్క విమానయాన సంస్థ కూడా దేశానికి ప్రయాణికులను తీసుకురావద్దని ఆదేశించింది. ఇవే ఆదేశాలు ఓడ రేవులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. సవరించిన ఉత్తర్వులన్నీ ఈనెల 31 వరకు తప్పనిసరిగా అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

సూచనల పట్టిక విడుదల చేసిన కేంద్రం..
కోవిడ్‌-19 వ్యాప్తి దృష్ట్యా సామాజిక దూరం పాటించాలని కేంద్రం పలు సూచనలు చేసింది. ఈ మేరకు పలు అంశాలతో కూడిన సూచనల పట్టికను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సూచనలన్నీ ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అన్ని సూచనలు సమీక్షించనున్నట్లు వారు తెలిపారు. 

అన్ని విద్యా సంస్థలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు సహా జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు, థియేటర్లను మూసివేయాలని సూచనల్లో కేంద్రం పేర్కొంది. విద్యార్థులు ఇంట్లోనే ఉండాలని, ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాలని సూచించింది. పరీక్షలను వాయిదా వేసే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా (వర్క్‌ ఫ్రం హోం) ప్రోత్సహించాలని పేర్కొంది. సాధ్యమైనంత వరకు సమావేశాలన్నింటినీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జరపాలంది. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలా చూడాలని, తరచూ జనం సంచరించే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనల్లో పేర్కొంది. ఇప్పటికే నిర్ణయం జరిగిన వివాహాలను పరిమిత సంఖ్యకు కుందించుకోవాలని, అనవసరమైన కార్యక్రమాలను వాయిదా వేయాలని కేంద్రం ప్రతిపాదించింది. నిత్యావసర వస్తువుల మార్కెట్లు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీస్ మొదలైన ప్రదేశాల్లో అవసరమైన సేవలు అందించాలని పేర్కొంటూ సూచనలు జారీ చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని