‘క్లోరోక్విన్‌ వల్ల తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి’

కరోనా వైరస్‌ చికిత్సలో ఆశాజనక ఫలితాలిస్తుందని భావిస్తున్న మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వల్ల ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ ఉంటాయని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) హెచ్చరించింది.......

Published : 25 Apr 2020 09:52 IST

హెచ్చరించిన అమెరికా ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ చికిత్సలో ఆశాజనక ఫలితాలిస్తుందని భావిస్తున్న మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వల్ల ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ ఉంటాయని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) హెచ్చరించింది. దీని వల్ల తీవ్ర హృదయ సంబంధిత సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ పరిణామాల గురించి ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే పొందుపరిచి ఉందని గుర్తుచేసింది. రోగి పరిస్థితిని ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ప్రభావాన్ని తగ్గించొచ్చని తెలిపింది. కరోనా సోకిన వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలో అక్కడ ఉండే వైద్య సిబ్బందే జాగ్రత్తగా నిర్ణయించాలని సూచించింది.

కొవిడ్‌-19పై పోరాడే సమర్థమైన మందు కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని.. అప్పటి వరకు ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ని దృష్టిలో ఉంచుకొనే చికిత్స అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించింది. ఇప్పటికే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని వాడేందుకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఆస్పత్రుల్లో చేరి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న కొవిడ్‌-19 రోగులకు మాత్రమే వైద్యుల సూచన మేరకు వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ డ్రగ్‌ వాడకానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను వైద్యులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 

అమెరికాలో వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రోజుల క్రితం కొవిడ్‌-19 రోగుల చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటు భారత్‌లోనూ అత్యవసర పరిస్థితుల్లో రోగికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఈ ఔషధాన్ని ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచించింది. అయితే, దీని వల్ల కొవిడ్‌-19 నయమవుతుందన్న అధికారిక ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. కరోనా వైరస్‌ను తుదముట్టించే సామర్థ్యం వీటికి ఉందో లేదో ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇవీ చదవండి..

ముప్పేట దాడి..!

ట్రంప్‌ ప్రమాదకర ‘కరోనో’ పాయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని