ట్రంప్‌ ప్రమాదకర ‘కరోనో’ పాయం
close
ట్రంప్‌ ప్రమాదకర ‘కరోనో’ పాయం

క్రిమినాశక రసాయనం నిమిషంలోనే కరోనా వైరస్‌ను చంపేస్తుందంటున్నారు. ఆ రసాయనాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టే మార్గం ఏమైనా ఉందా? లేదా దానితో శుద్ధి చేసే అవకాశం ఉందా? ఊపిరితిత్తుల్లోకి ఈ వైరస్‌ ప్రవేశించి, విలయం సృష్టిస్తోంది. అందువల్ల ఈ అంశాలను పరిశీలించడం అవసరం.

- ట్రంప్‌

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 రోగులు కోలుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వింత, ప్రమాదకర సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను చంపడానికి క్రిమినాశక రసాయనాలు (డిసిన్‌ఫెక్టెంట్‌)లను వారి శరీరంలోకి ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. అతినీల లోహిత (యూవీ) కాంతిని చొప్పించాలని కోరారు. దీనిపై అమెరికా ఆరోగ్య నిపుణులు మండిపడ్డారు. ప్రమాదకరమైన ఇలాంటి సలహాలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.

అమెరికా ‘హోం ల్యాండ్‌ సెక్యూరిటీ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ విభాగం తన తాజా శాస్త్రీయ అధ్యయనాన్ని శుక్రవారం వైట్హౌస్‌లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విభాగం అండర్‌ సెక్రటరీ బిల్‌ బ్రియాన్‌ మాట్లాడుతూ.. సూర్యకాంతి, తేమకు గురైనప్పుడు కరోనా వైరస్‌ చాలా వేగంగా చనిపోతుందని చెప్పారు. ‘‘సూర్యకాంతి నేరుగా పడినప్పుడు వైరస్‌ త్వరగా నాశనమవుతుంది. ఐసోప్రొపైల్‌ ఆల్కాహాల్‌ను ప్రయోగించినప్పుడు 30 సెకన్లలోపే అది హతమవుతుంది’’ అని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ కొవిడ్‌-19 రోగుల్లోకి రసాయనాలను ఇంజెక్ట్‌ చేసే అవకాశం ఉందా అని అడిగారు. ‘‘క్రిమినాశక రసాయనం నిమిషంలోనే వైరస్‌ను చంపేస్తుందంటున్నారు. ఆ రసాయనాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టే మార్గం ఏమైనా ఉందా? లేదా దానితో శుద్ధి చేసే అవకాశం ఉందా? అతినీల లోహిత కాంతి, శక్తిమంతమైన మరేదైనా ఇతర కాంతితో శరీరాన్ని బలంగా తాకిస్తే ప్రయోజనం ఉంటుందా? చర్మం ద్వారా కానీ మరేదైనా ఇతర మార్గంలో కానీ ఆ కాంతిని శరీరంలోకి ప్రవేశపెట్టాలి. ఈ విధానాన్ని కూడా పరీక్షిస్తామని మీరు చెప్పినట్లున్నారు’’ అని బ్రియాన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే క్రిమిసంహారక రసాయనాలు చాలా విషతుల్యమైనవని, వాటిని ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవడం కానీ, తాగడం కానీ చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. దీని వల్ల ప్రాణహాని జరుగుతుందని కొలంబియా విశ్వవిద్యాలయ మెడికల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ క్రెయిగ్‌ స్పెన్సర్‌ చెప్పారు.

కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొట్టివేశారు. ‘ఆ వార్తల్లో వాస్తవం లేదని అనుకుంటున్నాను’ అని సీఎన్‌ఎన్‌ అందించిన కథనాలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్‌ విలేకరులతో అన్నారు.

Tags :

మరిన్ని