20రోజుల తర్వాత వైద్యురాలు ఇంటికి!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుల పనితీరు ప్రతి ఒక్కర్నీ కదిలింపజేస్తోంది.

Published : 02 May 2020 00:33 IST

అభినందించిన ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుల పనితీరు ప్రతి ఒక్కర్నీ కదిలింపజేస్తోంది. కరోనా రోగులు అని తెలిసి కూడా నిరంతరం విధుల్లో ముందుండడం వారి సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా కొవిడ్‌ రోగులకు చికిత్సలో భాగంగా దాదాపు 20రోజుల పాటు ఇంటికి రాకుండా ఆసుపత్రికే పరిమితమైన ఓ వైద్యురాలు ఇప్పుడు ఎందరికో స్ఫూర్తినిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. ‘ఇలాంటి అరుదైన ఘటనలు మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇదే భారతీయుల స్ఫూర్తి. ఇదే స్ఫూర్తితో కరోనా మహమ్మారిపై ధైర్యంగా పోరాటం చేస్తాం. ఈ పోరులో ముందునిలిచి అలుపెరగని సేవలందిస్తున్న వైద్యులను చూసి గర్వంగా ఉంది’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న ఓ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఈ వైద్యురాలు సేవలందిస్తోంది. విధుల్లో భాగంగా గత 20రోజులపాటు ఆసుపత్రికే పరిమితమైన వైద్యురాలు తాజాగా తన ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఇంటి బయటకు వచ్చిన ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైద్యుల సేవలను కీర్తిస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతోపాటు చప్పట్లు, పూలతో వైద్యురాలికి స్వాగతం పలికారు. ఊహించని విధంగా స్వాగతం పలకడంతో భావోద్వేగానికి గురైన వైద్యురాలు కన్నీటిని చెమర్చడం ప్రతిఒక్కర్నీ కదిలిస్తోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు ప్రముఖులు స్పందించారు. అంతేకాకుండా ట్విటర్‌లో వైరల్‌ అయిన ఈ వీడియోను స్వల్ప కాలంలోనే లక్షల సంఖ్యలో వీక్షించారు. ఈ వీడియో చూసిన వారిలో కొందరు వైద్యుల సేవలను కొనియాడుతుండగా..మరికొందరు వారి పనితీరును మాటల్లో వర్ణించలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదర్కోవడంలో అలుపెరగని కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. ఆ వైద్యురాలికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ వీడియోలో పేర్కొనలేదు.

ఇవీ చదవండి..

అలుపెరగని పోరు...ప్రాణదాతలు వీరు..!

వైద్యులారా..కరోనా జాగ్రత్తలు పాటించాలి మీరు!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని