సరిహద్దులకు భారీగా బలగాలు..!

భారత్‌తో ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తన బలగాలను మోహరిస్తున్న చైనాకు అదే రీతిలో సమాధానం చెప్పాలని...

Published : 25 Jun 2020 18:26 IST

ముందస్తు చర్యల్లో భాగమన్న అధికారులు

దిల్లీ/లద్దాఖ్: ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తన బలగాలను మోహరిస్తున్న చైనాకు అదే రీతిలో సమాధానం చెప్పాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 3,488 కి.మీ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్ కూడా భారీగా సైన్యాన్ని తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత సైన్యానికి చెందిన అదనపు బలగాలతో పాటు ఇండో-టిబెట్‌ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)దళాలను కూడా పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐటీబీపీ దళాల తరలింపుపై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ మేరకు మిలిటరీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్‌ దేస్వాల్‌లు శనివారం లేహ్‌ ప్రాంతంలో పర్యటించనున్నారు. ‘‘గల్వాన్ ఘటనకు ముందే కొన్ని బలగాలను లద్దాఖ్‌కు పంపించాం. ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచనున్నాం’’ అని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గస్తీ పాయింట్ వద్ద సైన్యానికి తోడుగా ప్లాటూన్‌కు బదులు కంపెనీలను ఉంచాలని నిర్ణయించినట్లు సదరు అధికారి తెలిపారు. ఒక ప్లాటూన్‌లో 30 జవాన్లు ఉంటారు అదే ఒక కంపెనీలో 100 జవాన్లు ఉంటారని వెల్లడించారు.

జాతీయ భద్రతా మండలికి అందిన నివేదికల ప్రకారం సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయ, హాట్ స్ప్రింగ్స్‌, పాంగాంగ్ లేక్‌ మూడు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం  ఏప్రిల్30, 2020 ఉన్న యథాస్థితిని పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని భారత్ మోల్డోలో జరిగిన చర్చల్లో చైనాకు స్పష్టం చేసింది. ఈ మేరకు గల్వాన్‌ లోయ, గోగ్రాలోని గస్తీ పాయింట్లు 14, 15, 17 వద్ద బలగాలను తగ్గించాలని ఇరువర్గాలు పరస్పరం కోరినట్లు తెలుస్తోంది. బుధవారం నాటి శాటిలైట్ చిత్రాల్లో మాత్రం గల్వాన్‌ లోయలోని 14 నంబర్‌ గస్తీ పాయంట్ వద్ద  చైనా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నట్లు కనబడుతోంది. దానితో పాటు గస్తీ పాయింట్ 15లో భారీగా టెంట్లు వేసి తిష్ట వేశాయి. అలానే గస్తీ పాయింట్ 17 వద్ద పెద్ద ఎత్తున బలగాలను చైనా మోహరించినట్లు సమాచారం.

తాజా పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితులకు సంబంధించి అందిన నివేదికల ప్రకారం చైనా బలగాలు ఫింగర్‌ 4 వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనా సైన్యం ఎల్ఏసీ ప్రాంతంలో నిర్మాణాలను చేపడుతోందని, అందుకే భారత్ కూడా బలగాలు, మౌలిక సదుపాయాల పరంగా తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ తరలింపులు చేపడుతున్నట్లు మరో సీనియర్ అధికారి తెలిపారు. చైనాతో భారత్ సైనిక, ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చలు జరుపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధగా ఈ తరలింపులు చేపడుతున్నట్లు సదరు అధికారి తెలిపారు.  

గల్వాన్‌లో వెనక్కి వెళ్లిపోయిన చైనా బలగాలు!

భారత్, చైనా బలగాలు బాహాబాహీకి దిగిన గల్వాన్‌ లోయలో సైనిక బలగాలు వెనక్కి మరలాయని సమాచారం. ఆ ప్రాంతంలో డ్రాగన్‌ సైనికులు, వాహనాల సంఖ్యలో పాక్షిక తగ్గుదల కనిపించిందని అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం చైనీయులు అంతకు ముందుతో పోలిస్తే కిలోమీటర్‌ వెనక్కి వెళ్లిపోయారు.

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రికత్తలను తగ్గించేందుకు రెండు దేశాల అత్యున్నత సైనిక, దౌత్య సమావేశాల తర్వాత చైనీయులు వెనక్కి తగ్గడం ఇదే తొలిసారి. అయితే కేవలం గల్వాన్‌ లోయ వరకే ఇది పరిమితమైందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు