
Biden: తాలిబన్ల కంటే ప్రమాదకారులున్నారు
వారిని వేటాడేందుకే అఫ్గాన్ నుంచి వైదొలిగాం: బైడెన్
వాషింగ్టన్: తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయని, వాటిని నియంత్రించడానికే తాము అఫ్గానిస్థాన్ నుంచి వైదొలిగామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి సేనలను ఉపసంహరించుకోవడాన్ని ఆయన పూర్తిగా సమర్థించుకున్నారు. ఎక్కడ ముప్పు ఉందో అక్కడ దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో అల్‌ఖైదా, ఐసిస్‌లు ప్రాబల్యం పెంచుకున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అన్నారు. కాబుల్‌ను తాలిబన్లు వేగంగా చేజిక్కించుకోవడంపై బైడెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అమెరికాకు 30 వేల మంది అఫ్గాన్ శరణార్థులు!
అమెరికా దాదాపు 30 వేల మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయమివ్వనుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా అఫ్గాన్‌లోని అమెరికా సేనలకు దుబాసీలుగా, ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించిన వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అగ్రరాజ్యం కసరత్తు చేస్తోంది.
ఆయుధాలపై నిషేధం
అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం హస్తగతం చేసుకోవడంతో అమెరికా ఆ దేశానికి ఆయుధాలు అమ్మకూడదని నిర్ణయించింది. ఈ మేరకు నిషేధం విధిస్తూ బైడెన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలస్యమైతే తాలిబన్లు చంపేస్తారు!
గత రెండు దశాబ్దాలుగా అఫ్గానిస్థాన్‌లో అమెరికా, నాటో సేనలకు సాయం చేసిన స్థానికులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. గత రెండు రోజుల్లో తమ సైన్యంతో కలిసి పనిచేసిన ఐదుగురు అఫ్గాన్ అనువాదకులను తాలిబన్లు చంపేశారని అమెరికా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంటింటికి వెళ్లి అమెరికా సేనలతో, అఫ్గాన్ ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను తాలిబన్లు ప్రారంభించారు. దీంతో తొందరగా అమెరికా తరలించాలని, ఆలస్యమైతే తమ ప్రాణాలకే ముప్పు అని అఫ్గాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశాలకు నాయకులు ఎవరూ రాకూడదని అమెరికా ప్రభుత్వం అన్ని దేశాలను కోరింది. కరోనా దృష్ట్యా దీన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.
Advertisement