Flash News: కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌

తమిళనాడులో ఓ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఇందులో సైనిక ఉన్నతాధికారులు

Updated : 08 Dec 2021 17:50 IST

చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 

కూనూరు నుంచి విల్లింగ్టన్‌ ఆర్మీ బేస్‌కు వెళ్తున్న ఈ  ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందు కూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు దూరదర్శన్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. 80శాతం కాలిన గాయాలతో ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.

రక్షణబలగాల మార్గదర్శిగా..

ప్రస్తుతం బిపిన్‌ రావత్‌  చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు తొలి సీడీఎస్‌ ఆయనే. ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే.  లద్దాఖ్‌ సంక్షోభ సమయంలో ఆయన త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారు. మూడు దళాలు బీజింగ్‌ను సమష్టిగా ఎదుర్కొనే వ్యూహంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన ఫోర్‌స్టార్‌ జనరల్‌. 
 
* భారత్‌ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు ఆయన మార్గదర్శి. ప్రభుత్వం భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యత ఆయనదే. 

* ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే కంటే ముందు ఆయనే  ఆర్మీ బాధ్యతలు చూసుకొన్నారు. 

ఉత్తరాఖండ్‌లోని సైనిక కుటుంబంలో జన్మించి..

ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని