దేశంలో మహిళలకు భద్రత శూన్యం.. వ్యవస్థలో మార్పులు రావాలి 

మహిళలకు భద్రత కల్పించే విషయంలో మన దేశం బాగా వెనుకబడి ఉందని నిర్భయ తండ్రి అన్నారు. బాధితులకు న్యాయం

Published : 17 Dec 2021 10:58 IST

నిర్భయ తండ్రి వ్యాఖ్యలు 

దిల్లీ: మహిళలకు భద్రత కల్పించే విషయంలో మన దేశం బాగా వెనుకబడి ఉందని నిర్భయ తండ్రి అన్నారు. బాధితులకు న్యాయం సత్వరం అందేలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. 2012 డిసెంబరు 16న దక్షిణ దిల్లీలో 23 ఏళ్ల నిర్భయపై ఆరుగురు (వీరిలో ఒకరు అప్పటికి బాలుడు) దారుణ రీతిలో సామూహిక అత్యాచారానికి పాల్పడటం, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుల్లో నలుగురిని గత ఏడాది మార్చి 20న ఉరి తీశారు. మరొకడు అంతకుముందే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నేరస్థుడు 2015లోనే విడుదలయ్యాడు. నిర్భయపై అత్యాచారం జరిగి 9 ఏళ్లయిన నేపథ్యంలో.. ఆమె తండ్రి తమ తాజా పరిస్థితిని వివరించారు. కుమార్తెను కోల్పోయినందుకు ఇప్పటికీ బాధగానే ఉందన్నారు. దోషులకు తగిన శిక్ష పడటంతో తమకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. 

‘‘నా బిడ్డపై దారుణం జరిగినప్పుడు మహిళలంతా కన్నీరుపెట్టారు. 

యావత్‌ దేశం మాకు అండగా నిలిచింది. దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుందా అని అంతా ఎదురుచూశారు. ప్రతిఒక్కరి కృషి వల్లే మాకు న్యాయం జరిగింది. మేం ఇప్పటికీ బాధలోనే ఉన్నాం. కానీ దోషులకు శిక్ష పడటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. బాధితులకు సత్వర న్యాయం అందేలా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. మన దేశంలో మహిళలకు భద్రత శూన్యం’’ అని ఆయన పేర్కొన్నారు. ఏటా మార్చి 20ని న్యాయ్‌ దివస్‌గా జరుపుకొనే దిశగా తాము యోచిస్తున్నట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని