Pavel Antov: రష్యా ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు?

రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని రాయగడలో ఒకే హోటల్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై మిస్టరీ వీడలేదు.

Updated : 28 Dec 2022 09:23 IST

ఆయనది పుతిన్‌ను వ్యతిరేకిస్తున్న వర్గం
కొద్దిరోజుల్లోనే ఇద్దరు రష్యన్ల మరణంపై వీడని మిస్టరీ

రష్యాకు చెందిన ఇద్దరు పౌరులు ఒడిశాలోని రాయగడలో ఒకే హోటల్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై మిస్టరీ వీడలేదు. మృతి చెందినవారిలో ఒకరు రష్యా ఎంపీ పావెల్‌ ఆంటోవ్‌. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిర్ణయాలను, ముఖ్యంగా విదేశాంగ విధానాలను వ్యతిరేకించే నేతల్లో ఆయన ఒకరు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడాన్నీ ఆయన తప్పుపట్టారు. ఆయన పార్టీకే చెందిన మరో వ్యక్తి కూడా ఇదే హోటల్లో చనిపోయారు. వీరిద్దరూ ఒడిశా పర్యటనకు వచ్చారు. ఆంటోవ్‌ అత్యంత సంపన్నుల్లో ఒకరు. తన 65వ పుట్టినరోజు వేడుకల కోసమంటూ రాయగడ ప్రాంతానికి వచ్చారు. ఈ నెల 24న మూడో అంతస్తులోని తన గది కిటికీ నుంచి ఆయన కిందపడి మరణించారు. కుటుంబ సభ్యుల అనుమతితో సోమవారం ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఆయన పార్టీకే చెందిన వ్లాదిమిర్‌ బైదెనోవ్‌(61) అనే నేత రాయగడలోని అదే హోటల్‌లో ఈ నెల 22న అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

అసహజ మరణాలుగా పరిగణన: డీజీపీ

పావెల్‌, వ్లాదిమిర్‌ సహా నలుగురు రష్యన్లు ఈ నెల 21న రాయగడలోని హోటల్‌లో దిగారు. ఇప్పటివరకైతే మరణాలపై ఎలాంటి అనుమానాలు లేవని, అసహజ మరణాలుగా పరిగణించి వీటిపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఒడిశా డీజీపీ సునీల్‌ బన్సల్‌ మంగళవారం వెల్లడించారు. ‘గుండెపోటు వల్ల బైదెనోవ్‌ చనిపోయారని శవ పరీక్షలో తేలింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాం. ఆయన మృతిని తట్టుకోలేక స్నేహితుడు పావెల్‌ ప్రాణాలు కోల్పోయారు’ అని రాయగడ ఎస్పీ వివేకానంద శర్మ చెప్పారు. ప్రస్తుతం హోటల్‌లో మరో ఇద్దరు రష్యా పౌరులు ఉన్నారని, రష్యా దౌత్య కార్యాలయం నుంచి పత్రాలు వచ్చిన తర్వాత వీరు వెళ్లిపోతారని హోటల్‌ యజమాని కౌశిక్‌ ఠక్కర్‌ తెలిపారు. పుతిన్‌ను విమర్శించేవారిని మూడోకంటికి తెలియకుండా రహస్యంగా అంతమొందిస్తారనే ఆరోపణల నేపథ్యంలో వీరి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణాల వెనుక నేరపూరిత కోణమేదీ ఒడిశా పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు బయటపడలేదని రష్యా దౌత్య కార్యాలయం స్పష్టంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని