విభజనలు తెచ్చే ప్రయత్నాలు ఫలించవు: మోదీ

విభేదాలు అనే విత్తుల్ని నాటి, దేశంలో విభజనలు తీసుకురావాలనే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు.

Updated : 29 Jan 2023 06:04 IST

దిల్లీ: విభేదాలు అనే విత్తుల్ని నాటి, దేశంలో విభజనలు తీసుకురావాలనే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు విజయం సాధించలేవని చెప్పారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి శనివారం దిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప మైదానంలో ఆయన ప్రసంగించారు. దేశం వైభవాన్ని సాధించడానికి ఐక్యత మంత్రమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. దేశంలో ఉన్న యువత కారణంగా ప్రపంచం యావత్తూ మనవైపు చూస్తోందని, యువతకు సరికొత్త అవకాశాలు లభించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇప్పుడు సమయం భారత్‌కు అనుకూలమనేది అన్నిచోట్లా రుజువవుతోందని, ఇలాంటి తరుణంలో వేర్వేరు నెపాలతో భరతమాత బిడ్డల మధ్య విభజనలు తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటివి ఎన్నిఉన్నా ప్రజల మధ్య విభేదాలు ఎప్పటికీ రావని ప్రధాని చెప్పారు. బీబీసీ ఇటీవల వివాదాస్పద డాక్యుమెంటరీని తనపై రూపొందించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్‌సీసీ క్యాడెట్లను ప్రధాని అభినందించారు. ఉత్సాహం ఉరకలెత్తే యువతకు దేశంలో ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని మోదీ చెప్పారు. అంతరిక్షం, రక్షణ రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తున్నందువల్ల యువతకు అపార అవకాశాలు ఉంటాయని తెలిపారు. రక్షణరంగ సంస్కరణల గురించి ఆయన ప్రస్తావిస్తూ- ఒకప్పుడు సైన్యానికి అవసరమైన తుపాకులను దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు మన దేశంలోనే అవి తయారవుతున్నాయని చెప్పారు. ‘‘సరిహద్దుల్లో పెద్దఎత్తున చేపట్టిన మౌలిక సదుపాయాల పనుల ద్వారా యువతకు సరికొత్త అవకాశాల ప్రపంచం స్వాగతం పలుకుతోంది. అమ్మాయిలకూ ఇప్పుడు అవకాశాలు పుష్కలం. పోలీసు, పారా మిలిటరీ బలగాల్లో మహిళల సంఖ్య గత ఎనిమిదేళ్లలో రెట్టింపు అయింది. త్రివిధ దళాల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. సైనిక పాఠశాలల్లోనూ 1500 మంది బాలికలను తొలిసారిగా తీసుకున్నాం’’ అని మోదీ తెలిపారు. ఎన్‌సీసీకి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని, ప్రత్యేక కవరును ఆయన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని