UPSC: ఫలితాల్లో చిక్కుముడి: ఇద్దరు మహిళా అభ్యర్థులకు ఒకే నంబరు.. ఒకే ర్యాంక్‌

దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకాల కోసం జరిగే సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు ఎంపికై.. చివర్లో ఆటంకం ఎదురైతే ఆ బాధ వర్ణనాతీతం.

Updated : 26 May 2023 07:27 IST

భోపాల్‌: దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకాల కోసం జరిగే సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు ఎంపికై.. చివర్లో ఆటంకం ఎదురైతే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు మహిళా అభ్యర్థులకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో రాష్ట్ర అభ్యర్థులు ఆయేషా ఫాతిమా (23), ఆయేషా మక్రాని (26).. ఇద్దరూ 184వ ర్యాంకు సాధించారు. వీరిద్దరి రోల్‌ నంబర్లు కూడా ఒకటే. ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఇపుడు ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ వాళ్లిద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్‌ కార్డులను సమర్పించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదులు చేశారు. ఇద్దరి అడ్మిట్‌ కార్డులను నిశితంగా పరిశీలించినట్లయితే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ) నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్‌ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే, మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం అనీ, ఫాతిమా కార్డులో మంగళవారం అని రాసి ఉంది. క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్‌ మార్కుతోపాటు క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంది. మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం కనిపించడం లేదు. దీంతో యూపీఎస్సీ అధికారులు కూడా ఫాతిమానే అసలు అభ్యర్థి అని చెబుతున్నారు. అలాగని మక్రానీని కూడా తప్పుబట్టలేమని, పొరపాటు ఎక్కడ జరిగిందనేది దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని