Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి

ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొంతమందిని ఇప్పటికీ గుర్తించలేదు. ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుని పరిహారం సొమ్ములు కొట్టేయడానికి యత్నాలు ప్రారంభించారు.

Updated : 07 Jun 2023 07:29 IST

ఎవరూ గుర్తించని మృతదేహాలు తమ వారివే అంటున్న మోసగాళ్లు

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొంతమందిని ఇప్పటికీ గుర్తించలేదు. ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుని పరిహారం సొమ్ములు కొట్టేయడానికి యత్నాలు ప్రారంభించారు. నకిలీ ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరూ గుర్తించని మృతులను తమ కుటుంబసభ్యులుగా నమ్మించి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఈ నయా మోసాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

మోసం బయటపడిందిలా..

కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ ఆదివారం బాలేశ్వర్‌లోని మృతుల ఫొటోలను ఉంచిన ప్రదేశానికి వచ్చింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణించాడని, అతని ఆచూకీ తెలియడంలేదని పోలీసులకు తెలిపింది. దీంతో, అక్కడున్న ఫొటోలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. కొన్ని ఫొటోలను చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ.. అతడే తన భర్త అని గీతాంజలి చెప్పింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విచారించగా.. ఆమె భర్త బతికే ఉన్నాడని తేలింది. దీంతో గీతాంజలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఇలా వ్యవహరించినట్లు అంగీకరించింది. 

రైల్వేమంత్రి సమీక్ష

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంగళవారం దిల్లీలో రైల్వేబోర్డు అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. తర్వాత జనరల్‌ మేనేజర్లు, డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో సమావేశమయ్యారు. సిగ్నల్‌ వ్యవస్థలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని