భార్య ఎక్కిన విమానం ఆలస్యమంటూ ట్వీట్‌.. స్పందించిన ఇండిగో సంస్థ

పైలట్‌ అలసిపోవడం వల్లే తన భార్య వెళ్లాల్సిన విమానం మూడు గంటలు ఆలస్యమైందని దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. విమానం ఆలస్యం గురించి తన భార్య చేసిన వాట్సప్‌ చాటింగ్‌ను అతడు ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Updated : 04 Jul 2023 09:17 IST

దేహ్రాదూన్‌: పైలట్‌ అలసిపోవడం వల్లే తన భార్య వెళ్లాల్సిన విమానం మూడు గంటలు ఆలస్యమైందని దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు. విమానం ఆలస్యం గురించి తన భార్య చేసిన వాట్సప్‌ చాటింగ్‌ను అతడు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ వైరల్‌గా మారడంతో ఇండిగో స్పందించింది. ఆదివారం దేహ్రాదూన్‌-చెన్నై విమానంలో ఈ ఘటన జరిగింది.

సమీర్‌ మోహన్‌ అనే వ్యక్తి ఆ ట్వీట్లు చేశారు. తన భార్యకు కలిగిన అసౌకర్యం గురించి వెల్లడించి, పౌరవిమానయాన శాఖకు ట్యాగ్‌ చేశారు. పైలట్‌ అలసిపోయాడని, అతడి స్థానాన్ని భర్తీ చేసే మరో సిబ్బంది లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సమీర్‌ ట్వీట్లను బట్టి తెలుస్తోంది. అదే విమానంలో ప్రయాణించిన మరో వ్యక్తి.. విమానం లోపలి వీడియోను షేర్‌ చేశారు. ‘పైలట్స్‌ విమానాన్ని దిల్లీలో ల్యాండ్‌ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిబ్బంది చాలా అలసిపోయి ఉన్నారు’ అని విమానాల నిర్వహణ విషయంలో ఇండిగోపై విమర్శలు చేశారు. దీనిపై సంస్థ స్పందించింది. ‘ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. షెడ్యూల్‌ సమస్యల కారణంగా ఈ ఆలస్యం జరిగింది. ఈ సమయంలో ఓపిగ్గా ఉన్నందుకు కృతజ్ఞతలు’ అని విమానయాన సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని