Bihar: రూ.2 లంచం .. 37 ఏళ్లు విచారణ..

వాహనదారుల నుంచి అక్రమంగా రూ.2 వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలారు.

Updated : 04 Aug 2023 09:10 IST

నిర్దోషులుగా బయటపడ్డ ఐదుగురు పోలీసులు

వాహనదారుల నుంచి అక్రమంగా రూ.2 వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలారు. 1986లో నమోదైన ఈ కేసులో బిహార్‌లోని ఓ కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో రామరతన్‌ శర్మ, కైలాష్‌ శర్మ, జ్ఞాని శంకర్‌, యుగేశ్వర్‌ మహ్తో, రామ్‌ బాలక్‌ రాయ్‌ అనే ఐదుగురు పోలీసులపై నమోదైన కేసును కొట్టివేసింది. ఆ కేసు వివరాలివీ.. 1986 జూన్‌ 10న రాత్రి సమయంలో భాగల్‌పుర్‌ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్‌ వద్ద ఐదుగురు పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారుల నుంచి వారు రూ.2 వసూలు చేస్తున్నట్లు బెగుసరాయ్‌ ఎస్పీ అరవింద్‌ వర్మకు ఫిర్యాదు అందింది. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించిన ఎస్పీ.. అందుకు ఓ ప్రణాళిక రూపొందించారు. చెక్‌పోస్ట్‌ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపిన ఎస్పీ.. రూ.2 నోటుపై సంతకం చేసి దాన్ని డ్రైవర్‌కు ఇచ్చారు. పోలీసులు లంచం అడిగితే.. ఆ నోటును వారికి ఇవ్వమన్నారు. అనంతరం వాహనం చెక్‌పోస్ట్‌ వద్దకు వెళ్లగానే.. డ్రైవర్‌ నుంచి రూ.2 డిమాండ్‌ చేశారు పోలీసులు. దీంతో ఎస్పీ సంతకం చేసిచ్చిన ఆ నోటును ఓ కానిస్టేబుల్‌కు ఇచ్చాడు డ్రైవర్‌. అనంతరం తిరిగొచ్చి మొత్తం విషయాన్ని ఎస్పీకి తెలియజేశాడు. వెంటనే చెక్‌పోస్ట్‌ వద్ద వద్దకు వెళ్లిన ఎస్పీ.. కానిస్టేబుల్‌ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని