Jobs: ఉద్యోగాలిచ్చే చదువులే కావాలి

భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులను నేటి యువత ప్రగాఢంగా కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది.

Updated : 12 Aug 2023 10:52 IST

40.5శాతం మంది యువజనుల మాట ఇదే
యూఎన్‌ గ్లోబల్‌ సర్వేలో వెల్లడి

దిల్లీ: భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులను నేటి యువత ప్రగాఢంగా కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. స్వతంత్ర జీవనానికి, ఆర్థిక, సామాజిక భద్రతకు భరోసానిచ్చేలా విద్యాభ్యాసం కొనసాగాలన్నది తమ అభిలాషగా 10 నుంచి 24 ఏళ్ల వయసున్న గ్రూపులోని 40.5శాతం మంది తెలిపారు. ‘యువత ఏం కోరుకుంటోంది’ అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుబంధ పీఎంఎన్‌సీహెచ్‌ ప్రపంచవ్యాప్త రియల్‌టైమ్‌ సర్వేను నిర్వహిస్తోంది. 10 నుంచి 24 ఏళ్ల వయసున్న 7,13,273 మంది లిఖితపూర్వకంగా స్పందించారు. వీరిలో మన దేశానికి చెందిన వారు 17.2శాతంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 12న జరుపుకునే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే నిర్వాహకులు శుక్రవారం మధ్యంతర నివేదిక విడుదల చేశారు.

  • సర్వేలో పాల్గొన్న వారిలో... 15-19 వయసు గ్రూపు వారు 47.2 శాతంగా ఉన్నారు. వీరిలోనూ కిశోరప్రాయ బాలికలు 49.2 శాతం మంది. వీరందరూ పదే పదే ప్రస్తావించిన అంశం ఏమిటంటే...చదువునే అవకాశాలుండాలని, నాణ్యమైన విద్య లభించాలని.
  • భద్రత... భరోసానిచ్చే వాతావరణం ఉండాలని 21.2శాతం మంది చెప్పారు.
  • మంచి ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు 16.3శాతం మంది తెలిపారు.
  • కిశోరప్రాయ బాలురు...పరిశుద్ధమైన నీరు, మంచి రహదారులు ఉండాలని సూచించగా అదే వయసు బాలికలు పరిశుద్ధమైన నీరు అందుబాటులో ఉండాలని తెలపడంతో పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ ఇవ్వాలన్నారు.
  • నేటి యువత కోరుకుంటుందేమిటో తెలుసుకుని దేశాల వారీగా వాటిని సాకారం చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకునేందుకు, విధాన నిర్ణేతలను ఒప్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని పీఎంఎన్‌సీహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెల్గా ఫాగ్‌స్టాడ్‌ తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని