Chandrayaan-3: నిదానమే ప్రజ్ఞానం

విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రుడి ఉపరితలంపై సందడి చేస్తోంది. అడుగులో అడుగు వేస్తూ కొద్దిమీటర్ల దూరం ప్రయాణించింది.

Updated : 27 Aug 2023 08:48 IST

బుడిబుడి అడుగులేస్తున్న రోవర్‌
వేగం ఎక్కువైతే జాబిల్లి ధూళితో ముప్పు
ఈనాడు ప్రత్యేక విభాగం

విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రుడి ఉపరితలంపై సందడి చేస్తోంది. అడుగులో అడుగు వేస్తూ కొద్దిమీటర్ల దూరం ప్రయాణించింది. చూడటానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ దీని ప్రజ్ఞాపాటవాలు అమోఘం. దానికి కృత్రిమ మేధ ఉంది. రాళ్లను అలవోకగా దాటేయగలదు. లేజర్లు ప్రయోగించి, చంద్రుడిపై ఉన్న పదార్థాలను విశ్లేషించగలదు. ఇంత సామర్థ్యమున్నప్పటికీ ఇది బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తుంది. ఇందుకు కారణాలున్నాయి.


ప్రజ్ఞాన్‌ ఒక పెద్ద సూట్‌కేస్‌ పరిమాణంలో ఉంటుంది. దీని పొడవు 3 అడుగులు కాగా.. వెడల్పు 2.5 అడుగులు. రోవర్‌కు ఒక వైపున 36 అంగుళాల పొడవైన సౌరఫలకం ఉంటుంది. దీని ద్వారా 50 వాట్ల శక్తి ఉత్పత్తవుతుంది. ప్రజ్ఞాన్‌కు ఆరు చక్రాలు ఉన్నాయి. అవి వేర్వేరు విద్యుత్‌ మోటార్ల సాయంతో నడుస్తాయి.


ఆరు చక్రాలు ఎందుకంటే..?

  • జాబిల్లి ఉపరితలంపై ప్రయాణానికి అనువుగా ప్రజ్ఞాన్‌కు ఆరు చక్రాలను ఏర్పాటు చేశారు. చిన్నపాటి రాళ్లను అధిగమించడానికి మొదట ఒక చక్రం ఆ రాయిపైకి వెళుతుంది. మిగతా చక్రాలు రోవర్‌ను స్థిరంగా ఉంచుతాయి. ఈలోగా మొదటి చక్రం.. రాయిని దాటేస్తుంది. ఈ క్రమంలో రోవర్‌ ముందుకు కదులుతుంది. తర్వాత రెండో చక్రం రాయిపైకి చేరుతుంది.
  • ప్రజ్ఞాన్‌ చక్రాలకు రాకర్‌-బోగీ వ్యవస్థ ఉంది. ఇందులో చక్రాలను పట్టి ఉంచే భాగాలు.. వేర్వేరుగా కదిలే జాయింట్లకు అనుసంధానమై ఉంటాయి. రాళ్లు, రప్పలను అధిగమించే సమయంలో ఇవి కుషన్‌లా పనిచేస్తాయి. రోవర్‌ దృక్కోణంలో పెద్దగా మార్పులు లేకుండానే చక్రాలు విడిగా పైకి, కిందకి కదలగలవు.
  • ఆరు చక్రాలకు వేర్వేరుగా మోటార్లు కలిగి ఉండటం వల్ల.. వేటికవే విడిగా పనిచేయగలవు. అవసరాన్ని బట్టి మిగతా చక్రాలతో సంబంధం లేకుండా వాటిని ఎటువైపైనా తిప్పొచ్చు.
  • ఈ వెసులుబాట్ల వల్ల రోవర్‌.. ఉన్న ప్రదేశం నుంచే వెనక్కి తిరగగలదు. సూర్యుడి దిశగా తన సౌరఫలకం ఉండేలా చూసుకోవడానికి ఈ విన్యాసం ఉపయోగపడుతుంది.
  • విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి గరిష్ఠంగా అర కిలోమీటరు మాత్రమే రోవర్‌ వెళ్లగలదు. ఎందుకంటే దీనికి సొంతంగా భూ కేంద్రంతో కమ్యూనికేషన్లు సాగించే సామర్థ్యం లేదు. ల్యాండర్‌ ద్వారానే అవి సాగాలి. అందువల్ల ప్రజ్ఞాన్‌ ఎప్పుడూ ల్యాండర్‌కు దగ్గర్లో ఉండాలి.

చురుకైన కళ్లు..

ప్రజ్ఞాన్‌ రోవర్‌ ముందు భాగంలో రెండు నావిగేషన్‌ కెమెరాలు ఉన్నాయి. ఇవి నేత్రాల్లా పనిచేస్తాయి. మన రెండు కళ్లలో నిక్షిప్తమయ్యే చిత్రాలు వేర్వేరుగా ఉంటాయి. వాటిని కలపడం ద్వారా మన మెదడు ఒక సమగ్ర దృశ్యాన్ని ఆవిష్కృతం చేస్తుంది. అదే రీతిలో ప్రజ్ఞాన్‌ రోవర్‌లోని రెండు నేవిగేషన్‌ కెమెరాలు తీసే చిత్రాలను కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థ విలీనం చేస్తుంది. తద్వారా ఎదుటి దృశ్యాలు, అవరోధాలపై సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.


హీలియం బెలూన్‌తో పరీక్షలు

భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతే ఉంటుంది. అందువల్ల జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ బరువు ఆ మేరకు తగ్గుతుంది. అంత తక్కువ బరువుతో అది చంద్రుడి ఉపరితలంపై ఎలా పయనిస్తుందన్నది భూమిపై  పరీక్షించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు హీలియం బెలూన్‌పై ఆధారపడ్డారు. రోవర్‌ పైభాగంలో ఈ బెలూన్‌ను ఏర్పాటుచేశారు. గాలి కన్నా హీలియం తేలికగా ఉంటుంది. అందువల్ల ఆ బెలూన్‌.. రోవర్‌ను పైకి లాగుతుంది. ఈ క్రమంలో రోవర్‌ బరువును తగ్గిస్తుంది. ఈ పద్ధతిలో.. రోవర్‌ నడిచేటప్పుడు చంద్రుడిపై ఉన్నట్లు ఆరో వంతు బరువు (4.3 కిలోలు)ను మాత్రమే కలిగి ఉండేలా చూశారు. జాబిల్లి ఉపరితలాన్ని పోలిన మట్టిపై దాన్ని నడిపి విశ్లేషించారు.


నెమ్మదిగా ఎందుకు కదులుతుందంటే..

రోవర్‌ చాలా నెమ్మదిగా సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలమే కారణం. అక్కడ చాలా నున్నటి  ధూళి ఉంటుంది. రోవర్‌ చక్రాల కదలిక వేగంగా ఉంటే ఈ ధూళి పైకి ఎగిసే అవకాశం ఉంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ దుమ్ము చాలా సులువుగా పైకి లేవడంతోపాటు ఒకపట్టాన సద్దుమణగదు. రోవర్‌ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల.. కొద్దిపాటి ధూళి పైకి లేచినా అది రోవర్‌ పరికరాలు, కెమెరాలు, సౌరఫలకాలను కప్పేసే ప్రమాదం ఉంది. ఇవి ప్రజ్ఞాన్‌ సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు.

ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు, సిమ్యులేషన్లు నిర్వహించారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ కదలికల వల్ల చంద్రుడిపై ధూళి పైకి లేవకుండా ఉండాలంటే సెకనుకు 1 సెంటీమీటరు మేర మాత్రమే ప్రయాణించాలని నిర్ధారించారు.


ప్రజ్ఞాన్‌లోని సైన్స్‌ పరికరాలు..

ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (ఏపీఎక్స్‌ఎస్‌): ఈ పరికరంలోని రేడియోధార్మిక సాధనాలు ఆల్ఫా రేణువులను వెలువరిస్తాయి. అవి చంద్రుడి ఉపరితలంపైనున్న అణువులతో చర్యలు జరిపి, ఎక్స్‌రేలు విడుదలయ్యేలా చూస్తాయి. వాటిని ఏపీఎక్స్‌ఎస్‌లోని స్పెక్ట్రోమీటర్‌ విశ్లేషించి.. చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మూలకాలు ఉన్నాయన్నది గుర్తిస్తుంది.

లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (లిబ్స్‌): ఇది లేజర్లను చంద్రుడి ఉపరితలంపైకి ప్రసరింపచేస్తుంది. దీనివల్ల కొంత మట్టి ఆవిరై వేడి ప్లాస్మాగా మారుతుంది. దాన్ని స్పెక్ట్రోమీటర్‌ విశ్లేషించి, సంబంధిత నమూనాలో ఏ పదార్థాలు ఉన్నాయన్నది పసిగడుతుంది.


శివ్‌శక్తి కేంద్రంగా రోవర్‌ చక్కర్లు

ఆసక్తికర వీడియో విడుదల చేసిన ఇస్రో

ఈనాడు, బెంగళూరు: చంద్రయాన్‌-3 ల్యాండర్‌ దిగిన ప్రాంతాన్ని ‘శివ్‌శక్తి’గా ప్రధాని మోదీ నామకరణం చేసిన రోజున ఇస్రో విడుదల చేసిన రోవర్‌ వీడియో మరింత ఆసక్తి గొలిపింది. రోవర్‌ మెల్లగా చక్కర్లు కొడుతున్న దృశ్యం ఇందులో కనిపించింది. ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా చిత్రీకరిస్తున్న చప్పుడు ఈ వీడియోలో ఆకట్టుకునే అంశం. ల్యాండర్‌ నుంచి దిగిన రోవర్‌ 8 మీటర్ల దూరం వరకు నడిచినట్లు శుక్రవారం వెల్లడించిన ఇస్రో ఆపై ఏమి జరిగిందో ఒక్కో వీడియో ద్వారా షేర్‌ చేస్తూ వస్తోంది. శనివారం సాయంత్రం ఇస్రో షేర్‌ చేసిన తాజా వీడియోలో కాస్త దూరం నడిచిన రోవర్‌ ఎడమ వైపునకు మెల్లగా తిరిగినట్లు కనిపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువ రహస్యాలను అధ్యయనం చేసే క్రమంలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ ‘శివ్‌శక్తి’ పాయింట్‌ వద్ద చక్కర్లు కొడుతోందంటూ ఇస్రో వ్యాఖ్యానించింది.

మూడింట రెండు లక్ష్యాలు పూర్తి

చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించి మూడింట రెండు లక్ష్యాలు పూర్తయ్యాయని ఇస్రో శనివారం వెల్లడించింది. చందమామ ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడంతోపాటు జాబిల్లిపై రోవర్‌ను నడిపినట్లు పేర్కొంది. మూడో లక్ష్యమైన ‘శాస్త్రీయ పరిశోధనల నిర్వహణ’ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని